calender_icon.png 18 November, 2025 | 5:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నలభై ఏళ్ల క్రితం అమితాబ్ ఇలా చేసుంటే బాగుండేది

20-06-2024 12:05:00 AM

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస, దీపిక పదుకొణె ముఖ్య తారాగణంగా రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం ముంబైలో జరిగింది. ప్రధాన తారాగణంతో పాటు నిర్మాతలైన అశ్వినీదత్, స్వప్న, ప్రియాంక ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు సినిమాని మరో మెట్టు ఎక్కించే క్రమంలో తన వంతు సహకారం అందించే రానా ఈ కార్యక్రమంలోనూ సందడి చేశారు. దర్శకుడు నాగ్ అశ్విన్, తను బాల్య మితృలమమని తెలిపిన రానా, ఆయన బాగా చదువుకుని ఇలాంటి సినిమాలు చేస్తుంటే.. తాను మాత్రం ఇలా ఉన్నానంటూ ఆహుతుల్ని నవ్వించారు.

కార్యక్రమంలో దర్శకుడు లేని లోటు తీరుస్తూ అతిథులతో ఆయన గురించి చెప్పించే ప్రయత్నం చేసిన రానా, దర్శకుడంటే నమ్మలేనంత సాధారణంగా కనపడే నాగ్ అశ్విన్‌ను చూసి ఏమనుకున్నారు అని కమల్ హాస న్‌ను ప్రశ్నించారు. దానికి ఆయన బదులిస్తూ ‘సాధారణంగా కనపడుతూ అసాధారణ పనులు చేసే వ్యక్తులు తనకు కొత్తేమీ కాదని, తన గురువు కె.బాలచందర్ సైతం ఆ కోవకి చెందిన వారేనని గుర్తుచేసుకున్నారు. అలా కనపడే వ్యక్తుల్ని నేను ఏ మాత్రం తక్కువ అంచనా వేయను’ అని చెప్పుకొచ్చారు.

కార్యక్రమంలో నిర్మాత అశ్వినీదత్ గురించి అమితాబ్ ప్రస్తావిస్తూ ‘సెట్లో అందరికంటే ముందుండే వ్యక్తి ఆయనే. ఇంత వినయం, హుందా కలిగిన వ్యక్తిని నేను చూడలేదు’ అని కొనియాడారు. అనంతరం అశ్వినీదత్ నుంచి బిగ్ టికెట్ కొనుగోలు చేసిన బిగ్ బీ దానిని కమల్‌కు బహూకరించగా, “నలభై ఏళ్ల క్రితం ‘షోలే’ సినిమా సమయంలో అమితాబ్ ఇలా టికెట్ ఇచ్చి ఉంటే బాగుండేది” అని కమల్ చమత్కరించారు. ఆ సినిమా కోసం తాను మూడు వారాల పాటు వేచి చూడాల్సి వచ్చిందన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ ‘కల్కి’ సినిమా కోసం సైతం ఎంతోమంది తన లాంటి అభిమానులు ఎదురుచూస్తున్నారన్నారు. దిగ్గజ నటులు అమితాబ్, కమల్‌తో నటించడం కల కంటే గొప్పదిగా భావిస్తున్నా అని ప్రభాస్ పేర్కొన్నారు. ఆద్యంతం నవ్వులతో సాగిన ఈ కార్యక్రమంలో ప్రస్తుతం గర్భవతిగా ఉన్న కథానాయిక దీపిక ‘ప్రభాస్ పెట్టిన తిండి పదార్థాల మూలంగానే తన పొట్ట ఇలా అయిందేమో’ అని ఛలోక్తి విసిరారు.