23-08-2025 12:00:00 AM
భద్రాచలం, ఆగస్టు 22 (విజయ క్రాంతి)రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో మోడల్ స్పోరట్స్ స్కూల్ కిన్నెరసాని విద్యార్థులు బంగారు పతకం కైవసం చేసుకొని జాతీయస్థాయి క్రీడలకు ఎంపిక కావడం చాలా సంతోషకరమని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.శుక్రవారం తన చాంబర్లో 15 సంవత్సరాల లోపు వాలీబాల్ క్రీడలలో బంగారు పతకం సాధించిన విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మోడల్ స్పోరట్స్ స్కూల్ కిన్నెరసాని విద్యార్థులు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆగస్టు 19 తేదీన జరిగిన స్కూల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండర్15 ఎస్.జి.ఎఫ్.ఐ రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొని బంగారు పతకంతో పాటు విజేత నిలిచి ట్రోఫీని కైవసం చేసుకున్నారని ఆయన అన్నారు.
ఈ పోటీలలో జాతీయ స్థాయికి ఎంపికైన 9వ తరగతి విద్యార్థులు రిషివర్మ, వెంకన్నబాబు, జాతీయస్థాయిలో రాణిస్తే అంతర్జాతీయ స్థాయి క్రీడలు చైనాలో జరిగే ప్రపంచ వాలీబాల్ కప్ కు హాజరవుతారని అన్నారు.గిరిజన విద్యార్థిని విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని అన్నారు. ఈ జోష్తో ఈనెల 26, 27న పూణేలో జరిగే జాతీయ స్థాయి సెలెక్షన్ ట్రయల్స్లో ప్రతిభ కనబరిచి, ప్రపంచ వాలీబాల్ కప్ పోటీలలో కూడా పాల్గొనే స్థాయికి ఎదగాలని అందుకు క్రీడా కోచులు, పీఈటీలు విద్యార్థులకు మంచి క్రమశిక్షణతో సాధన చేయించాలని ఆయన అన్నారు.
రాష్ట్ర స్థాయిలో విద్యార్థులను ప్రతిభ కనబరచడానికి కృషి చేసిన పీడీ సుబ్రహ్మణ్యం, పీఈటీ అంజయ్య, వాలీబాల్ కోచ్ వాసులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఏసీఎంఓ రమేష్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చందు, వార్డెన్ వెంకటేశ్వర్లు, పీడీలు బాల సుబ్రహ్మణ్యం, పీఈటీ అంజయ్య, కోచ్ వాసు, తదితరులు పాల్గొన్నారు.