23-10-2025 01:59:20 AM
-కొనేళ్ళని సంక్షేమ పథకాలు
-ధాన్యం కొనుగోలుపై నిబంధనలు ఎత్తివేయాలి
-మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్దిపేట, అక్టోబర్ 22 (విజయక్రాంతి): ఒక ఎకరానికి 25 నుంచి 30 క్వింటాళ్ల మక్కలు దిగుబడి వస్తే ప్రభుత్వం మాత్రం ఒక ఎకరాకు 18 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని నిబంధన పెట్టడం సిగ్గుచేటని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. బుధవారం సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మక్లజోన్నల, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించడం వల్ల సుమారు 14వేల క్వింటాళ్ల మొక్కజొన్నలను రైతులు దళారులకు విక్రయించి నష్టపోయారని తెలిపారు.
రూ.16వందలకు క్వింటాలు చొప్పున దళారులు కొనుగోలు చేస్తుంటే ప్రభుత్వం దళారులనే ప్రోత్సహిస్తుందని విమర్శించారు. అందుకే ఎకరానికి 18 క్వింటాళ్ల మొక్కజొన్నలు మాత్రమే కొనుగోలు చేస్తామని నిబంధన పెట్టిందని మండిపడ్డారు. రైతు పండించిన పంటలన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తెలిపారు. అధికారం కోసం ఇచ్చిన హామీలన్నీ నీరుగారుతున్నాయని, ఏ ఒక్క సంక్షేమ పథకం కొనేళ్ళలేదని ఎద్దేవా చేశారు.
అన్ని పంటలకు బోనస్ ఇస్తానంటూ ఇవ్వకుండా రైతుల ఉసురు పోసుకుంటున్న రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని రైతులను కోరారు. నిబంధన లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధికారులు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.