08-08-2025 12:00:00 AM
నల్లగొండ నిఘా విభాగం, ఆగస్టు07 (విజయక్రాంతి): నాలుగు గోడల మధ్య కూర్చుని అక్రమంగా డబ్బు సంపాదించటం ఎలానో ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయ సిబ్బందికి వెన్నతో పెట్టిన విద్యగా మారింది. కమిషన్లు ఇస్తేనే సంతకాలు కాదంటే నేరుగా అధికారులకు దగ్గర వెళితే కస్సు బస్సు ఇది నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియా ఆర్డబ్ల్యూఎస్ డీఈ కార్యాలయం పనితీరుకు నిదర్శనం.
ఆ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులదే రాజ్యం. మధ్యవర్తులు చెప్పిందే వేదం అన్నట్లు అధికారులు ఫైళ్లు చక్కబెడుతుంటారు. అడిగినంత ముట్టజెపితే గంటల్లో పని, లేదంటే రోజుల తరబడి ప్రదక్షిణలు. కార్యాలయ విభాగాలపై పర్యవేక్షణ జరిపి అక్రమాలకు తావివ్వకుండా చూడాల్సిన ఉన్నతాధికారే ముడుపులకు అలవా టుపై స్థానికులు మండిపడుతున్నారు.
చుట్టపు చూపుగా విధులకు..
ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో పని చేసే ఏఈఈలు చుట్టపుచూపుగా కార్యాలయానికి వస్తున్నారు. ఫీల్డ్కు వెళ్లారని కిందిస్థాయి సిబ్బంది చేత చెప్పిస్తున్నారేగాని, విధులకు డుమ్మా కొడుతున్నారని సమాచారం. హాలియా కేంద్రంలోనే మచ్చుకూ కనిపించని ఏఈఈలు కూడా ఉన్నారంటే పరిస్థితి ఎంతదారణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విధులకు హాజరుకాని వారికి వేతనాలు ఇవ్వడం దండగ అని పలువురు విమర్శిస్తున్నారు.
ఆ ఇద్దరు ఉద్యోగులు ఏళ్ల తరబడి తిష్ఠ
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ హాలియా గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్)లో కార్యాలయంలో ఇద్దరు ఇంజనీర్ల సీనియర్ ఉద్యోగులు ఏళ్ల తరబడి ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని ,పెద్దవూర ,అనుముల , మండలానికి 2016 లో నియామకమైన ఇంజనీర్లు వారు సమయానికి కార్యాలయానికి రాకుండా, ఉన్నతాధికారులను సైతం లెక్క చేయకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
బ్లాక్మెయిల్ చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం. రాజకీయ పార్టీల నేతలో సంబంధాలు కొనసాగిస్తూ అడ్డగోలు వ్యవహారాలకు అడ్రస్గా మారిన స్థానిక ఆర్డబ్ల్యూఎస్(గ్రామీణా నీటి సరఫరా విభాగం)ను ప్రక్షాళన చేయాలన్న వాదన బలంగా వినిపిస్తున్నది. ప్రధానంగా వివిధ క్యాడర్లలోని ఉద్యోగులు ఏళ్ల తరబడి ఇక్కడే తిష్ఠ వేశారు. ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన బదిలీల ప్రక్రియను సైతం తమకు అనుకూలంగా మలచుకుని ఇక్కడే మరో ఐదేళ్లు ఉండేలా బదిలీల్లో మతలబులు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లే బినామీ వ్యక్తులను కాంట్రాక్టర్లుగా చూపించి వాళ్లే ఆయా పనులు చేసి లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సదరు ఇంజనీర్లు సుమారు 10 ఏండ్లుగా ఇక్కడే ఉంటూ పలువురు, కాంట్రాక్టర్లను తమ గుప్పెట్లో పెట్టుకుని దండిగా సంపాదించారని, దీంతో ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఆయన ఇష్టపడడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ ఇద్దరు ఏఈఈలు గత 10 కొన్నాళ్లుగా ఇక్కడే ఉంటూ రెండు చేతులా సంపాదిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
ఆర్‌డబ్ల్యూఎస్‌లో ఏటా రూ. కోట్లలో పనులు.. మిషన్ భగీరథ పథకంలో భారీగా అవినీతి..
అనుముల మండలంలో జరిగిన మిషన్ భగీరథ పనుల్లో సదరు ఆర్డబ్ల్యూఎస్ అధికారి భారీగా అవినీతి పాల్పడ్డారని ఆరోపణలు వెళ్లి వస్తున్నాయి. పేరూరు గ్రామంలో మిషన్ భగీరథ పథకం కింద నల్లాలను పైపులైన్లను స్థానిక ప్రజాప్రతినిధితో కలిసి బ్లాక్ మార్కెట్లో అమ్మి లక్షల రూపాయలను దండుకున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.