calender_icon.png 29 October, 2025 | 10:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గెస్టులుగా స్టార్స్ కన్నా డైరెక్టర్స్‌ను పిలవడమే మేలు

29-10-2025 12:58:38 AM

తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన కొత్త సినిమా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. బై 7పీఎం, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సందీప్ అగరం, అశ్మితారెడ్డి నిర్మాతలు కాగా, కల్పనారావు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 7న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్‌కు టాలీవుడ్ దర్శకులు కరుణకుమార్, యదు వంశీ, ఆదిత్య హాసన్, రామ్ అబ్బరాజు, సన్నీ, దుశ్యంత్, ఉదయ్ గుర్రాల, రూపక్, తేజ, నందకిషోర్ అతిథులుగా విచ్చేశారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథి దర్శకుడు కరుణకుమార్ మాట్లాడుతూ.. “కొత్తగా సినిమాలు తీసేటప్పుడు మేకర్స్‌కు ఉండే కష్టాలు మా అందరికీ తెలుసు.. ఈరోజు ఇంత మందిని ఈవెంట్‌కు తీసుకురావడం బాగుంది. డెబ్యూ మేకర్స్ సినిమా కష్టాల నుంచి బయటపడేందుకు ఇదొక మంచి మార్గం. స్టార్స్‌ను, హీరోలను పిలిస్తే సమయాభావం వల్ల వారు రాలేరు. ఇలా డైరెక్టర్స్‌ను పిలిస్తే సినిమా త్వరగా ప్రజల్లోకి వెళ్తుంది” అన్నారు. హీరో తిరువీర్ మాట్లాడుతూ.. “ఎంతో సరదాగా షూటింగ్ చేశాం. ఫ్యామిలీ అంతా కలిసి టూర్‌కు వెళ్లినట్టుగా షూటింగ్ చేశాం” అని చెప్పారు. ‘మా సినిమా మంచి కంటెంట్‌తో తీశాం. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంద’ని హీరోయిన్ టీనా శ్రావ్య తెలిపింది.

చిత్ర దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. “ఈ సినిమాకు ఆన్‌స్క్రీన్, ఆఫ్‌స్క్రీన్‌లో హీరో తిరువీర్‌” అన్నారు. “ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ను అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని చిత్ర నిర్మాత సందీప్ కోరారు. ఇక అతిథులు మాట్లాడుతూ.. ఈ సినిమా సిట్యువేషనల్ కామెడీతో రానుందన్నారు. కొత్త వాళ్లను సపోర్ట్ చేసేందుకు ఎప్పుడూ ముందుంటామని తెలిపారు. స్టార్ హీరోలు వారి స్టార్‌డమ్‌ను బట్టి, లెక్కల్ని బట్టి కొన్ని కథలు చేయలేరని, ఎలాంటి పాత్రనైనా తిరువీర్ అవలీలగా పోషిస్తాడని చెప్పారు. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ఫ్యామిలీ అంతా కలిసి చూసి హాయిగా నవ్వుకునేలా ఉంటుందన్నారు. బాల నటుడు రోహన్, నటి యామిని, నటుడు నరేంద్ర, సంగీత దర్శకుడు సురేశ్ బొబ్బిలి, మిగతా చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.