calender_icon.png 29 October, 2025 | 8:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రజనీ, అమితాబ్‌లా వినోదం పంచే అరుదైన నటుడు రవితేజ

29-10-2025 12:59:54 AM

‘మాస్ మహారాజ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్టార్ హీరో సూర్య 

రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘మాస్ జాతర’. సినిమా రచయిత భాను భోగవరపు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. అక్టోబర్ 31న థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి స్టార్ హీరో సూర్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో సూర్య మాట్లాడు తూ.. “రవితేజ అభిమానులను, నా ఫ్యాన్‌ను ఇలా చూడటం ఆనందంగా ఉంది.

అభిమానుల మధ్య లో జరిగే ఇలాంటి వేడుకకు హాజరవ్వడం నాకిష్టం. రవితేజతో నాది 20 ఏళ్ల అనుబంధం. ఈరోజు ఒక ఫ్యాన్‌బాయ్‌లా మాట్లాడుతున్నా. ఆయన పేరు వింటేనే ఆనందం కలుగుతుంది. ఎనర్జీ మనిషి రూపంలో ఉంటే అది రవితేజ. తెరపై ఒక కామన్ మ్యాన్‌ను కింగ్ సైజ్‌లో సహజంగా చూపించాలంటే అది రవితేజకే సాధ్యమవుతుంది. తన సహజ నటనతో పాత్రకు ప్రాణం పోస్తారు. ఆయన నటనకు నేను అభిమానిని. నవ్వించడం చాలా కష్టం. కానీ, రవితేజ మాత్రం తనదైన శైలిలో చాలా తేలికగా ఎన్నో ఏళ్లుగా వినోదాన్ని పంచుతున్నారు.

ఇడియట్, కిక్ సహా రవితేజ సినిమాలు తమిళ్‌లోనూ ఆదరణ పొందాయి. విక్రమార్కుడు రీమేక్ నా సోదరుడు కార్తీ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అయింది. రవితేజలా వినోదాన్ని పంచేవాళ్లు అరుదుగా ఉంటారు. రజినీకాంత్, అమితాబ్‌బచ్చన్ ఎలాగైతే వినోదాన్ని పంచగలరో రవితేజ కూడా అలాగే అలరిస్తారు. ఆయన ఇలాగే వినోదాన్ని పంచుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అక్టోబర్ 31న ‘మాస్‌జాతర’ రూపంలో రవితేజ జాతర చూడబోతున్నాం. అసిస్టెంట్ డైరెక్టర్‌గా మొదలై, సపోర్టింగ్ యాక్టర్‌గా, మాస్ మహారాజాగా ఎదిగిన రవితేజ ఎందరికో స్ఫూర్తి. నాగవంశీ బ్యానర్‌లో నేనొక సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. భీమ్స్ అద్భుతమైన సంగీతం అందించారు. భవిష్యత్తులో ఆయనతో కలిసి పనిచేస్తానని ఆశిస్తున్నా.

అక్టోబర్ 31న ‘మాస్ జాతర’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు. హీరో రవితేజ మాట్లాడుతూ.. “మనది సూపర్‌హిట్ కాంబినేషన్ అని లీలతో సెట్లో అం టుంటా.. ఇది కాబోంతోంది. అందుకే అంత నమ్మకంగా చెప్తున్నా. థియేటర్లో కొత్త లీలను చూడబోతున్నారు. మా కాంబోను తప్పకుండా ఎంజా య్ చేస్తారు. భాను రూపంలో ఇండస్ట్రీకి కొత్త డైరెక్టర్ దొరికాడు. ఈ సినిమా తర్వాత ఆయనకు కూడా అభిమానులు అయిపోతారు” అన్నారు. కథానాయకి శ్రీలీల మాట్లాడుతూ.. “ధమాకా’తో రవితేజ ఫ్యాన్స్ నన్ను ఓ మెట్టు ఎక్కించారు.

ఈ సినిమాతో మరో మెట్టెక్కిస్తారని అనుకుంటున్నాను. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఇంతకుముందు నన్ను చూసినట్టు ఉండదు. సినిమాలో రవితేజను ఏక వచనంతో సంబోధిస్తూ తిడతాను. ఆయన ఫ్యాన్స్ నన్ను తిట్టుకోవద్దని కోరుకుంటున్నాను” అని చెప్పింది. చిత్ర దర్శకుడు భాను మాట్లాడుతూ.. “సమాజంలోని కొన్ని యూనివర్సిటీల్లాగే రవితేజ ఇండస్ట్రీలో విశ్వవిద్యాలయాన్ని పెట్టారు. ఆ వర్సిటీ నుంచి ఈ మధ్యే నేను డిగ్రీ పట్టా పుచ్చుకొని బయటికొచ్చాను.. నేను డిస్టింక్షన్‌లో పాసయ్యానని అనుకుంటున్నాను.. ఈ విషయాన్ని ప్రేక్షకులే అందరికీ చెప్పాలి” అన్నారు.

నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. “రవితేజ నుంచి ఏం ఆశించి వస్తారో ఆ అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుంటుంది. ఈసారి ఏం జరిగినా దుబాయ్ మాత్రం వెళ్లడంలేదు.. టెన్షన్ పడకండి (నవ్వుతూ)” అన్నారు. భీమ్స్ సిసిరోలియో ‘ఈ భూమ్మీద నాకు నూకలు చెల్లిపోయాయనుకున్న సమయంలో రవితేజ నాకు అండగా నిలిచారు” అన్నారు.  ఈ కార్యక్రమంలో నటులు రాజేంద్రప్రసాద్,  నవీన్‌చంద్ర, దర్శకుడు రామ్ అబ్బరాజు, మిగతా టీమ్ పాల్గొన్నారు.