calender_icon.png 27 January, 2026 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిరుధాన్యాలతో..బువ్వ

03-01-2025 12:00:00 AM

ఎన్ని వెరైటీలు తిన్నా..  అన్నం తినకపోతే ఏదో వెలితి.. ఆరోజు ఏదో కోల్పోయిన భావనతో ఉంటారు కొందరు.. అన్నంతో లాభాలకన్నా.. నష్టాలే ఎక్కువంటున్నారు న్యూట్రిషన్స్. అందుకే అన్నంకు ప్రత్యామ్నాయంగా ‘వి లవ్ మిల్లెట్స్’ అంటున్నారు ఎక్కువమంది. మిల్లెట్స్‌ను కూడా అన్నం లాగే వండుకోవచ్చు.. నచ్చిన కూరగాయల్ని జత చేర్చి.. మీకిష్టమైన స్టయిల్లో వండుకోవచ్చు. పోషకగుణాలు కలిగిన కొన్నిరకాల మిల్లెట్స్ వంటలు ఇవి.  

జొన్నలతో..

తయారీ: జొన్నల్ని శుభ్రం చేసి, కడిగి వీలైతే ఒక రోజంతా లేదంటే పది గంటలు నానబెట్టాలి. తర్వాత వాటిని ప్రెషర్ కుక్కర్‌లో వేసి ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఎందుకంటే జొన్నలు మెత్తబడేందుకు కొంచెం టైం పడుతుంది. ఒకవేళ కుక్కర్‌లో ఉడికించడం నచ్చకపోతే మందపాటి గిన్నెలో నానబెట్టిన జొన్నలు వేసి నీళ్లలో ఉడికించుకోవచ్చు.

ఇలా చేస్తే ఎక్కువ టైం పడుతుంది. జొన్నలు ఉడికించిన నీళ్లను పారబోయకుండా తర్వాత వంటలో వాడేందుకు పక్కన పెట్టాలి. ఒక పాన్‌లో నూనె వేడిచేసి ఇంగువ, జీలకర్ర, ఆవాలు వేగించాలి. అవి చిటపటమంటున్నప్పుడు కరివేపాకులు, ఉల్లి, వెల్లుల్లి, అల్లం తరుగు వేయాలి. మీడియం మంట మీద మూడు నాలుగు నిమిషాలు ఉడికించాలి.

ఉల్లి తరుగు ఉడికాక కూరగాయలు, టొమాటోల తరుగు వేసి మరో మూడు నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత ఉడికించి పక్కన పెట్టిన జొన్నలు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి, జొన్నలు ఉడికించిన నీళ్లు ఒక కప్పు పోయాలి. మధ్యమధ్యలో గరిటెతో తిప్పుతూ మీడియం మంట మీద పది నుంచి పన్నెండు నిమిషాలు ఉడికిస్తే జొన్నల పులావ్ రెడీ. వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. 

కొర్రలతో..

తయారీ: కొర్రలను శుభ్రంగా కడిగి గోరు వెచ్చని నీళ్లలో ఒక గంట నానబెట్టాలి. పాన్‌లో నూనె వేడి చేసి మసాలా దినుసుల్ని వేగించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు వేగించాలి. తర్వాత కూరగాయల ముక్కలు, పుదీనా వేసి మూడు నుంచి నాలుగు నిమిషాలు వేగించాలి. పచ్చి వాసన పోతుంది. నీళ్లు పోసి ఉప్పు సరిపడా వేయాలి.

అవి ఉడుకు వచ్చాక నానబెట్టిన కొర్రల్లో నీళ్లు వంపేసి వడకట్టిన కొర్రలను ఉడుకుతున్న నీళ్లలో వేయాలి. ఓ మాదిరి లేదా తక్కువ మంట మీద అవి ఉడికే వరకు ఉంచాలి. అవి ఉడికాక ఏమైనా కాస్త తేమ ఉంటే మంట పెంచి నీళ్లు ఆవిరి అయ్యే వరకు ఉంచి స్టవ్ ఆపేయాలి. మూత పెట్టి సరిగ్గా ఏడు నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత కొర్రల పులావ్‌ని రైతా కాంబినేషన్‌లో తినాలి. 

ఊదలతో..

తయారీ: ఒక కప్పు ఊదలను శుభ్రంగా నీళ్లలో కడిగి పక్కన పెట్టాలి. నెయ్యి వేడి చేసి జీలకర్ర, కరివేపాకులు, పచ్చిమిర్చి వేయాలి. అవి వేగాక ఓ మాదిరిగా తరిగిన ఆలుగడ్డ ముక్కలు వేసి అవి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. అందుకు కొన్ని నిమిషాల టైం పడుతుంది. తర్వాత కడిగి పెట్టుకున్న ఊదలు వేసి కొన్ని నిమిషాలు అటు ఇటు గరిటెతో కలపాలి.

తర్వాత రెండున్నర కప్పులు నీళ్లు పోసి ఉప్పు వేసి బాగా కలపాలి. మూత పెట్టి మంట తగ్గించేయాలి. తక్కువ సెగ మీదనే ఏడెనిమిది నిమిషాలు ఊదలు ఉడికించాలి. నీళ్లను పీల్చుకున్న ఊదలు ఉబ్బుతాయి. అప్పుడు ఊదల పులావ్ రెడీ అయినట్టు. పైనుంచి వేగించిన పల్లీలు వేసి, కొత్తిమీర చల్లుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. 

అరికెలతో..

తయారీ: నెయ్యి, నూనెల మిశ్రమాన్ని ప్రెషర్ కుక్కర్‌లో వేడి చేయాలి. స్టవ్ మంట తగ్గించి దాల్చిన చెక్క, సోంపు, బిర్యానీ ఆకు వేగించాలి. సోంపు రంగు మారకముందే ఉల్లి తరుగు వేయాలి. అవి కాస్త వేగాక అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకు వేగించాలి. తర్వాత కూరగాయలు తరుగు, పుదీనా ఆకులు వేసి ఓ మాదిరి మంట మీద రెండు నిమిషాలు వేగించాలి.

తర్వాత కూరగాయల ముక్కల్లో ఉప్పు కొంచెం వేయాలి. ఆ తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న అరికెలు వేసి బాగా కలపాలి. పొడి పొడిగా కానివ్వాలి. స్టవ్ మంట మీడియంలోనే ఉంచాలి ఈ వంట చేస్తున్నంతసేపు. పొడిపొడిగా అయిన మిశ్రమంలో నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడికించాలి. బాగా కలిపి కుక్కర్‌లో పెట్టి మీడియం మంట మీదనే ఒక విజిల్ వచ్చేవరకు ఉంచాలి. లేదంటే తక్కువ మంట మీద పన్నెండు నిమిషాలు ఉడికించాలి.