calender_icon.png 10 January, 2026 | 8:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుపతన్నతో మాట్లాడింది నిజమే..

09-01-2026 12:54:59 AM

  1. భార్యాభర్తల కేసు పరిష్కరించాలని ఫోన్ చేశా 
  2. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ 
  3. విచారణకు చిరుమర్తి లింగయ్య కూడా హాజరు

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 8 (విజయక్రాంతి): రాష్ట్రాన్ని కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యా ప్తులో హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలోని ప్రత్యే క విచారణ బృందం ‘సిట్’ దూకుడు పెంచింది. కేసు దర్యాప్తును వేగవంతం చేసిన అధికారులు రాజకీయ నాయకుల ప్రమేయంపై దృష్టి సారించారు. ఇటీవల జారీచేసిన నోటీసుల మేరకు గురువారం కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వేర్వేరుగా సిట్ విచారణకు హాజరయ్యారు.

గంటల తరబడి సాగిన ఈ విచా రణలో అధికారులు వారిపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అదనపు ఎస్పీ తిరుపతన్న మొబైల్ ఫోన్ డేటాను కూడా సిట్ అధికారులు నిశితంగా విశ్లేషించారు. ఈ క్రమంలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, తిరుపతన్నతో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు సాంకేతిక ఆధారాలు లభించాయి. దీనిపై అధికారులు జైపాల్ యాదవ్‌ను నిలదీశారు.

అధికారుల ప్రశ్నలకు జైపాల్ స్పందిస్తూ.. తాను తిరుపతన్నతో మాట్లాడిన మాట వాస్తవమేనని అంగీకరించారు. అయి తే, అది రాజకీయ లబ్ధి కోసం కాదని, తమ సామాజిక వర్గానికి చెందిన ఒక భార్యాభర్తల గొడవను పరిష్కరించేందుకే ఫోన్ చేశానని తెలిపారు. సమస్య పరిష్కారం కోసమే రెండు ఫోన్ నంబర్లు ఇచ్చానని, అంతేకానీ ఆ నంబర్లను అధికారులు ట్యాప్ చేస్తారని తనకు తెలియదని స్టేట్‌మెంట్లు ఇచ్చినట్లు తెలిసింది.

అలాగే మరో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా విచారణకు హాజరయ్యారు. ఆయన సిట్ అధికారులకు ఇచ్చిన స్టేట్‌మెంట్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.మరోవైపు, ఇదే కేసులో ఎమ్మె ల్సీ నవీన్ రావు తండ్రి కొండల్ రెడ్డి, ఎమ్మె ల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావును బుధవారమే ప్రశ్నించాల్సి ఉండగా, వారు గైర్హాజరయ్యారు. వయసు పైబడటం, అనారోగ్య కారణాల రీత్యా తాను కార్యాలయానికి రాలేనని, ఇంట్లోనే సిట్ అధికారులకు స్టేట్మెంట్ ఇస్తానని కొండల్ రెడ్డి తన న్యాయవాది ద్వారా సమాచారం పంపారు.

తన కుమారుడు సందీప్ రావు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారని, మరో నాలుగు రోజుల తర్వాత స్వదేశానికి రాగానే సిట్ ఎదుట విచారణకు హాజరవుతారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.. సిట్ చీఫ్ సజ్జనార్‌కు ఫోన్‌లో వివరణ ఇచ్చారు. రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ కేసులో రానున్న రోజుల్లో మరికొంతమంది ప్రముఖులకు నోటీసులు అందే అవకాశముందని సిట్ వర్గాలు భావిస్తున్నాయి.