calender_icon.png 11 January, 2026 | 10:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖాకీ గుండెల్లో కరుణ

10-01-2026 08:39:28 PM

బీద కుటుంబానికి అండగా వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య

మహబూబ్‌నగర్ టౌన్: పట్టణం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటనలో కృష్ణవేణి అనే బీద మహిళ కుటుంబం సర్వస్వాన్ని కోల్పోయింది. కృష్ణవేణి భర్త ఆంజనేయులు గతంలో మృతి చెందగా ఆమె కూలి పనులు చేస్తూ అద్దె ఇంట్లో జీవనం సాగిస్తోంది. ఆమెకు 9వ తరగతి చదువుతున్న ఒక కుమారుడు ఉన్నాడు.

శనివారం ఉదయం దేవునికి దీపం పెట్టి కూలి పనికి వెళ్లిన సమయంలో ఉదయం సుమారు 11.30 గంటల సమయంలో ఆమె నివాసం నుండి ఒక్కసారిగా పొగలు, మంటలు రావడంతో ఇరుగుపొరుగు వారు గమనించి వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ సమాచారం అందగానే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య తమ సిబ్బందితో కలిసి తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని, ఫైర్ సిబ్బందితో కలిసి మంటలను అదుపులోకి తెచ్చారు.

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా, ఇంట్లో ఉన్న బట్టలు, వంట సామాగ్రి, ఇతర గృహోపకరణాలు పూర్తిగా కాలిపోయి బూడిద అయ్యాయి. ఈ పరిస్థితిని గమనించిన వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య మానవతా దృక్పథంతో స్పందించి, బాధిత కుటుంబానికి కట్టుకునేందుకు బట్టలు, నెల రోజుల పాటు తినేందుకు సరుకులు, వండుకునేందుకు అవసరమైన వంట పాత్రలను డిఎస్పి వెంకటేశ్వర్లు చేతుల మీదుగా అందించి ఆదుకున్నారు. ఆయన చూపిన ఈ మానవీయ సహకారానికి జిల్లా ఎస్పీ శ డి.జానకి,  స్థానికులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వన్ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ సీనయ్య, సిబ్బంది పాల్గొన్నారు.