calender_icon.png 10 May, 2025 | 5:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసెంబ్లీలో దుమారం జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్

14-03-2025 01:14:45 AM

బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై వేటు

మీరు పెద్దమనిషి మాత్రమే.. సభ మీ సొంతం కాదని స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలే కారణం

  1. సభాపతి ఆదేశాలతో సభ నుంచి వెళ్లిపోయిన జగదీశ్‌రెడ్డి
  2. ఆందోళనకు దిగిన బీఆర్‌ఎస్ సభ్యులు.. సభ నుంచి వాకౌట్

* ప్రతిపక్షాలు గవర్నర్ ప్రసంగంపైనే మాట్లాడాలి. ఇప్పటి వరకు అధికార పక్ష సభ్యులు గవర్నర్ ప్రసంగంపైనే మాట్లాడారు. నన్ను ప్రశ్నించడమే సభ సంప్రదాయాలకు విరుద్ధం. మాట్లాడే సమ యంలో అసహనానికి గురికావొద్దు. సభాసంప్రదాయాలను కాపా డాలి. పదేళ్లు మంత్రిగా ఉన్నారు.. సభా సంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం సరికాదు. 

 జగదీశ్‌రెడ్డికి స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సూచన

* బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి వ్యవహరించిన తీరు చాలా బాధాకరం. ఏకవచనంతో స్పీకర్‌ను ఉద్దేశించి మాట్లాడటం సరికాదు. నిబంధనల ప్రకారం ఏ సభ్యుడు కూడా సభలో లేదా సభ వెలుపల స్పీకర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. స్పీకర్ చర్యలు, అధికారాలను ప్రశ్నించే అధికారం ఏ సభ్యుడికి లేదు. సభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. సభ్యులందరి కోరిక మేరకు జగదీశ్ రెడ్డిని ఈ సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేయాలని ప్రతిపాదిస్తున్నా. 

 శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాంతి): బడ్జెట్ సమావేశాలు రెండో రోజు వాడీవేడిగా నడిచాయి. గురువా రం సభ ప్రారంభం కాగానే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో సభలో దుమారం లేచింది.

గవర్నర్ ప్రసంగంపై, స్పీకర్‌ను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు అవమానకరం గా ఉన్నాయని మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ సభ్యు లు తీవ్రంగా తప్పుబట్టారు.  జగదీశ్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని మంత్రి సీతక్క సభాపతిని కోరారు.

ఈ సెషన్స్ వరకు ఆయన్ను సస్పెండ్ చేసి.. విచారణకు ఎథిక్స్ కమిటీకి నివేదించాలని డిఫ్యూటీ సీఎం భట్టి కోరారు. అనంతరం శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రతి పాదనల మేరకు జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చే స్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జరిగే బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకూ ఆయనపై వేటు కొనసాగనుంది.

దీనిపై బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళన చేశారు. పోడియం వద్దకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే సస్పెన్షన్ గురైన జగదీశ్‌రెడ్డి సభను వీడి వెళ్లిపోవాలని స్పీకర్ ఆదేశించడంతో ఆయన సభను వీడారు. దీంతో బీఆర్‌ఎస్ సభ్యులు సైతం తమ ఆందోళనను విరమించి సభ నుంచి వాకౌట్ చేశారు. 

కాగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు గాను రెండో రోజు అసెంబ్లీలో స్పీకర్‌పై జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో సభ్యుల గందరగోళం మధ్య ఉదయం 11.55 గంటలకు సభను వాయిదా వేయగా.. అనంతరం మధ్యాహ్నం 3.35 గంటలకు సభ తిరిగి ప్రారంభమైంది.

వెంటనే స్పీకర్‌పై జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం, రామచంద్రనాయక్, మందుల సామ్యేల్, మంత్రులు సీతక్క, ఉత్తమ్, డిఫ్యూటీ సీఎం భట్టి.. సభ్యుడి సస్పెన్షన్‌పై ప్రతిపాదించారు. మంత్రి శ్రీధర్ బాబు రూల్ బుక్ ఆధారంగా తీర్మానం ప్రవేశపెట్టగా స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. 

సభలో అందరికీ సమాన అవకాశాలు: జగదీశ్‌రెడ్డి

గవర్నర్ మనస్ఫూర్తిగా తన ప్రసంగాన్ని చదివి ఉండరని, ఏదో మెకానికల్‌గా చదివారని జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని చాట్ జీపీటీ ఏఐ వాడి రూపొందించారని ఆరోపించారు. 15 నెలల పాలనను కేవలం 15 నిమిషాల్లో చదివేశారన్నారు. 36 నిమిషాల్లో 360 అబద్ధాలను గవర్నర్ చేత చెప్పించారని ఆరోపించారు.

రైతులకు రుణమాఫీ చేశారా? మహాలక్ష్మి పథకాన్ని అమలు చేశారా? రైతు కూలీలకు రూ.12వేలు ఇచ్చారా? విద్యార్థినులకు స్కూటీలు ఇచ్చారా? తులం బంగారం ఇచ్చారా? అని ప్రభుత్వాన్ని  ప్రశ్నించారు. అధికారం కోసం లక్షల అబద్ధాలు చెప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తాను గవర్నర్ ప్రసంగంపైనే మాట్లాడుతున్నానని.. అధికార పక్షం నుంచి మంత్రి ఏం మాట్లాడారో.. రాష్ర్టమంతా చూస్తోందని.. ఆయన మాట్లాడిన మాటలకు.. గవర్నర్ ప్రసంగానికి సంబంధం ఉందా? అని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. దానిపై తేల్చాలని.. సభలో ఉండమంటే ఉంటా? లేకపోతే పోతానన్నారు.

సభలో జరుగుతున్నతదంతా రాష్ర్ట ప్రజలు చూస్తున్నారన్నారు. జగదీశ్ రెడ్డి మాట్లాడుతుండగా మధ్యలో కాంగ్రెస్ సభ్యులు రన్నింగ్ కామెంట్ చేయగా, ‘నా ముందు మాట్లాడొద్దు.. మూస్కోండి’ అని వ్యాఖ్యానించారు. ‘తాను ఏం విరుద్ధంగా మాట్లాడానో చెప్పాలన్నారు. ఈ సభ అందరిదీ.

సభ్యులందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. మా అందరి తరఫున పెద్ద మనిషిగా, స్పీకర్‌గా మీరు కూర్చున్నారు. ఈ సభ మీ సొంతం కాదు’ అంటూ స్పీకర్‌ను ఉద్దేశించి జగదీశ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. 

సస్పెండ్ చేసి ఎథిక్స్ కమిటీకి నివేదించాలి: డిఫ్యూటీ సీఎం భట్టివిక్రమార్క

జగదీశ్‌రెడ్డి స్పీకర్‌ను ఉద్దేశించి చేసి న వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని డి ఫ్యూటీ సీఎం భట్టివిక్రమార్క పేర్కొ న్నారు. గవర్నర్‌ను అవమానించారని, ఇప్పుడు స్పీకర్‌ను సైతం అవమానించారని అన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పని, సభను నడిపేందుకు స్పీకర్‌కు విశేషమైన అధికారాలు ఉంటాయన్నారు. స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలు సభనే కాకుండా సమాజాన్ని కూడా బాధపెడుతున్నాయని అందు కే సభ్యున్ని ఈ సెషన్స్‌కు సస్పెండ్ చేసి ఆయన తీరును ఎథిక్స్ కమిటీకి నివేదించాలని కోరారు.

స్పీకరే సుప్రీం.. అందరూ గౌరవించాల్సిందే: భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

శాసన వ్యవస్థ లో స్పీకరే సుప్రీం అని, అందరూ ఆ యన్ను గౌరవించాల్సిందేనని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. స్పీకర్‌ను ఎవరూ ప్రశ్నించేందుకు అధికారం లేదన్నారు. జగదీశ్‌రెడ్డి వ్యవహరించిన తీరు అత్యంత దుదృష్టకరమన్నారు. శాసన వ్యవస్థను అవమానించిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల విషయాన్ని ఎథిక్స్ కమిటీకి పంపాలని అన్నారు. 

జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలు జుగుప్సాకరం: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలని మంత్రి సీతక్క అసెంబ్లీలో ప్రతిపాదించారు. జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని మండిపడ్డారు. స్పీకర్ అంటే వ్యక్తి కాదని... వ్యవస్థ అని తెలిపారు. ఓ దళితుడు స్పీకర్ కుర్చీలో కూర్చోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. ఏకవచనంలో స్పీకర్‌ను అవమానించారన్నారు. గిరిజన గవర్నర్‌ను పార్టీ కార్యకర్త అన్నట్లుగా మాట్లాడటం అవమానకరమ న్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అట్టడుగు వర్గాలను అవమానించే విధంగా మాట్లాడారని వెల్లడించారు. 

జగదీశ్ ఏం తప్పు మాట్లాడారు: మాజీమంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు

జగదీశ్‌రెడ్డి ఏం తప్పు మాట్లాడార ని హరీశ్‌రావు సభ లో ప్రశ్నించారు. సభలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయనడంలో తప్పులేదన్నారు. శాసనసభ అంటే కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వానికి సంబంధించినది కాదన్నారు.