14-03-2025 01:12:34 AM
సీఈఓ సుదర్శన్ రెడ్డి రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
పెద్దపల్లి మార్చి-13(విజయక్రాంతి): మార్చి 19 లోపు ఓటర్ జాబితా సవరణ, ఇతర అంశాల పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాల నిర్వహణపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ జిల్లాలో ప్రతి 3 నెలలకు ఒకసారి పకడ్బందీగా అప్ డేట్ కావాలని,, నూతనంగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక పౌరుడికి ఓటు హక్కు కల్పించాలని, ఓటర్ జాబితా సవరణ, పోటీ చేసిన అభ్యర్థుల వివరాల సమర్పణ, బూత్ స్థాయి ఏజెంట్ల నియామకం తదితర అంశాల పై జిల్లా ఎన్నికల అధికారులు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో మార్చి 19 లోపు సమావేశాల నిర్వహణ పూర్తి చేయాలని సీఏస్ ఆదేశించారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించే సమయంలో మినట్స్ పకడ్బందీగా నమోదు చేసుకోవాలని, సమావేశానికి హాజరైన ప్రతినిధుల సంతకాలను ప్రత్యేకమైన రిజిస్టర్ లో తీసుకోవాలని అన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం మినిట్స్ ఇతర వివరాలను మార్చి 27 లోపు ఎన్నికల కమిషన్ కు సమర్పించాలని ఆయన ఆదేశించారు.
జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో, అదే విధంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రెవెన్యూ డివిజన్ అధికారులు, ఏం.ఆర్.ఓ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో నిర్వహించాలని సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో నూతన ఓటర్ నమోదు, ఓటు బదిలీ, మరణించిన వారి ఓటర్ వివరాల తొలగింపు వివిధ అంశాలకు వాడే ఫారం లను పూర్తి స్థాయిలో వివరించాలన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ డివిజన్ అధికారి బి.గంగయ్య, సూపరిండెంట్ విజయ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.