22-01-2026 02:00:11 AM
గాయపడుతున్న భక్తులు
మేడారం, జనవరి 21 (విజయక్రాంతి): మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు మరో వా రం రోజులు గడువు ఉండగానే ముందస్తు మొక్కలు చెల్లించుకోవడానికి బుధవారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గద్దెల ప్రాంగణం ఇటీవల విస్తరించడంతో పెద్ద ఎత్తున భక్తులు లోపలికి వస్తున్నారు. దీనితో గద్దెల పైకి భక్తులను అనుమతిం చడంతో చాలామంది ఎక్కువ సేపు అక్కడే ఉంటుండగా రద్దీ పెరగడంతో బయట నుండి భక్తులు మొక్కులు చెల్లించుకోవడానికి తెచ్చిన బంగారం బెల్లం కొబ్బరికాయలను గద్దెల ప్రాంగణం పైకి విసురుతున్నారు. దీనితో బుధవారం ఐదుగురు భక్తులకు గాయాలయ్యాయి.
గాయపడ్డ వారిని రెస్క్యూ టీమ్ సభ్యులు వెంటనే బయటకు తీసుకువచ్చి ప్రథమ చికిత్స నిర్వహించి అనంతరం గద్దెల ప్రాంగణం వెలుపల ఉన్న ఆసుపత్రికి తరలించారు. భక్తులు వనదేవతలను దర్శించుకున్న తర్వాత గద్దెల ప్రాంగణం నుండి కొంత బంగారం బెల్లం వెంట తీసుకు వెళ్ళడం కోసం తోపులాడుకుంటున్నారు. గద్దెల పైన మొక్కుగా సమర్పించిన బెల్లం బంగారాన్ని కొంత ఇవ్వడానికి ఏర్పాట్లు లేకపోవడంతో ఎవరికి వారే బంగారం బెల్లం తీసుకోవడానికి పోటీ పడుతున్నారు. దీనితో గద్దెల ప్రాంగణం పైన రద్దీ పెరగడానికి కారణంగా చెబుతున్నారు. భక్తులు సంయమనం పాటించి నిదానంగా దర్శించుకుని వెళ్లాలని అధికారులు, పోలీసులు సూచిస్తున్నప్పటికీ భక్తులు వనదేవతలను దర్శించుకోవడానికి పోటీ పడుతూనే ఉన్నారు.