25-09-2025 12:00:00 AM
సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం ‘జైలర్’. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్‌గా ప్రస్తుతం ‘జైలర్2’ రూపొందుతున్న సంగతి తెలిసింది. తొలి భాగంలో రమ్యకృష్ణ, వినాయకన్, వసంత్ రవి, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, తమన్నా కీలక పాత్రల్లో నటించారు. సీక్వెల్‌లో శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్ పాత్రలు కొనసాగనుండగా..
మిగతా పాత్రల్లో ఎవరెవరు మళ్లీ కనిపించనున్నారన్నది ప్రస్తుతానికి రహస్యంగా ఉంచింది చిత్రబృందం. అయితే, ఈ సీక్వెల్‌ను కూడా ఫస్ట్ పార్ట్‌ను రూపొందించిన సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కోసం ఇటీవలే టీమ్ కేరళకు వెళ్లింది. ఈ సందర్భంగా సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడొస్తుందనే విషయమై హింట్ ఇచ్చి అభిమానులను ఫుల్ ఖుషీ చేశారు రజినీ.
ఈ సందర్భంగా మీడియాతో చిట్‌చాట్ చేసిన తలైవా.. “ఈ సినిమాను 2026 జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. షూటింగ్ చాలా అద్భుతంగా కొనసాగుతోంది” అని తెలిపారు. ఇక ఈ మూవీ టీమ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ డిసెంబర్ లేదా వచ్చే జనవరికల్లా ‘జైలర్2’ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తికానున్నాయి. అనంతరం నిర్మాణానంతర పనులు ప్రారంభిస్తారు.