25-09-2025 10:23:11 PM
సిద్దిపేట క్రైమ్: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'ఓజీ' సినిమా హిట్ కావాలని ఆకాంక్షిస్తూ ఆయన వీరాభిమాని ఒకరు పాదయాత్ర చేపట్టాడు. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని అప్పంపల్లి గ్రామానికి చెందిన తాళం నవీన్(35) అనే యువకుడు ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లి బోరబండలో నివాసం ఉంటున్నాడు. నవీన్ కు చిన్నతనం నుంచి హీరో పవన్ కల్యాణ్ అంటే ఇష్టం.
ఈ క్రమంలో గురువారం విడుదలైన పవన్ నటించిన 'ఓజీ' సినిమా విజయవంతం కావాలని బల్కంపేట ఎల్లమ్మ ఆలయం నుంచి కొండగట్టుకు పాదయాత్ర చేపట్టాడు. మంగళవారం రాత్రి ప్రారంభించిన ఈ పాదయాత్రలో భాగంగా గురువారం సిద్దిపేట కు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కు ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక విజయవాడ నుంచి పిఠాపురం వరకు పాదయాత్ర చేసి, అమ్మవారికి మొక్కు తీర్చుకున్నట్టు నవీన్ చెప్పాడు. ఇప్పటికే రెండుసార్లు పవన్ కళ్యాణ్ ను కలిసినట్టు తెలిపాడు.