calender_icon.png 23 September, 2025 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జంబర్ గింబర్ లాలా..

23-09-2025 12:09:29 AM

ప్రియదర్శి, నిహారిక ఎన్‌ఎం, విష్ణు ఓఐ, రాగ్ మయూర్, ప్రసాద్ బెహారా, వెన్నెల కిషోర్, సత్య, వీటీవీ గణేశ్ ప్రధాన తారాగణంగా రూపొందుతున్న హాస్యభరిత చిత్రం ‘మిత్రమండలి’. బీవీ వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందిస్తున్న ఈ సినిమాకు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డాక్టర్ విజయేందర్‌రెడ్డి తీగల నిర్మాతలు. అక్టోబర్ 16న విడుదల కానున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ‘కత్తందుకో జానకి’, ‘స్వేచ్చా స్టాండు’ అనే రెండు పాటలు, టీజర్ విడుదలయ్యాయి. 

తాజాగా ఈ సినిమా నుంచి మూడో గీతం ‘జంబర్ గింబర్ లాలా’ రిలీజ్ అయ్యింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో ఈ గీతావిష్కరణ కార్యక్రమంలో నటుడు బ్రహ్మానందం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ.. “అందరినీ నవ్వించాలనే సిద్ధాంతంతోనే కమెడియన్స్ బతుకుతున్నారు. అందుకే కమెడియన్స్‌ను ఆశీర్వదించండి.. కామెడీని బతికించండి” అన్నారు.

హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. “ఏకలవ్య శిష్యుడిగా బ్రహ్మానందం సినిమాలు చూసి పెరిగాను. ఆయనతో వేదికను పంచుకోవడం.. కల నిజమైనట్టుగా ఉంది” అని చెప్పారు. కథానాయిక నిహారిక ఎన్‌ఎం మాట్లాడుతూ.. “నేను సోషల్ మీడియాలో కామెడీ కంటెంట్ క్రియేట్ చేయడానికి ప్రేరణ బ్రహ్మానందం. నా మొదటి సినిమాలోనే ఆయనతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నా” అని తెలిపారు.

చిత్ర సమర్పకుడు బన్నీ వాసు మాట్లాడుతూ.. “మిత్ర మండలి సినిమా ప్రేక్షకుల ముఖంపై నవ్వులు పూయించడానికే తీస్తున్నాం. బ్రహ్మానందం ఒక భాషలా మారిపోయారు. మన ప్రతి భావాన్ని ఆయన మీమ్స్, ఎక్స్‌ప్రెషన్స్ ద్వారానే పంచుకుంటాం. రాబోయే 25 రోజులు సోషల్‌మీడియాలో మిత్ర మండలి మాత్రమే కనిపిస్తుంది” అన్నారు. చిత్ర దర్శకుడు విజయేందర్ ఎస్, చిత్ర నిర్మాత విజయేందర్‌రెడ్డి తీగల, సంగీత దర్శకుడు ఆర్‌ఆర్ ధ్రువన్, మిగతా చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.