23-08-2025 06:44:05 PM
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
కరీంనగర్ (విజయక్రాంతి): ఈ నెల 24న చొప్పదండి నియోజకవర్గంలో నిర్వహించనున్న మీనాక్షి నటరాజన్ పాదయాత్రలో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ గౌడ్, తుమ్మల నాగేశ్వరరావు వచ్చే జనహిత పాదయాత్రను విజయవంతం చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం(MLA Medipally Sathyam) పిలుపునిచ్చారు. శనివారం కరీంనగర్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కనివిని ఎరుగని రీతిలో నిర్వహించే పాదయాత్ర ఇదని అన్నారు. భారతదేశంలో ఏ ప్రభుత్వం, పార్టీ చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశామని అన్నారు. గత ప్రభుత్వం లక్షల కోట్ల అప్పు చేసిందని విమర్శించారు. మేము 48 గంటల్లో మహిళలకు ఉచిత బస్సు, సిలెండర్ సబ్సిడి, ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు, రేషన్ కార్డ్, రైతు భరోసా, నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించామన్నారు.
కేటీఆర్ చిల్లర మాటలు మాట్లాడుతూ, డబ్బులు పంచుతూ చిల్లర వేషాలు వేస్తున్నారని విమర్శించారు. పది సంవత్సరాల్లో గాయత్రి పంప్ హౌస్ నుండి నీళ్ళు తీసుకుపోయారని ప్రశ్నించారు. మీరు కొత్తగా ఒక్క ఎకరానికి కూడా ఆయా కట్టుకు నీరు ఇవ్వలేదని అన్నారు. కేసీఆర్ కొండగట్టుకు నిధులు ఇస్తామని ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. గతం లో జేఎన్టీయూసీ కాంగ్రెస్ ఇచ్చిందని, ఇప్పుడు గంగాధర డిగ్రీ కాలేజీ చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గంను ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేస్తామని తెలిపారు. మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మీ సిరిసిల్ల లో కూడా మేము ఏం చేయాలో అది చేస్తామని హెచ్చరించారు. మా నియోజక వర్గంలో రైతులకు ఇబ్బంది లేకుండా ప్రతి రోజూ కలెక్టర్ తో మాట్లాడుతూ చూసుకుంటున్నామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చెప్పారు.