calender_icon.png 24 August, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మళ్లీ చిరుత కలకలం

23-08-2025 10:42:54 PM

మేకలు గొర్రెల పెంపకం దారులు అడవిలోకి రావద్దని హెచ్చరిక

దౌల్తాబాద్: నెలరోజుల కిందట దొమ్మాట, గాజులపల్లి, అల్మాస్ పూర్ శివారులో మూడుసార్లు కలకలం రేపిన చిరుత పులి తాజాగా మళ్లీ ప్రత్యక్షమైంది. శనివారం అల్మాస్ పూర్ గ్రామానికి చెందిన సంతోష్ చిరుత పులి సంచరించిందని, కొండాపూర్ గ్రామానికి చెందిన సంజీవులు చిరుత పులి అరుపులు వినిపించాయని, దొమ్మాట ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మధులతకు ఫిర్యాదు చేశారు. చిరుత  సమాచారం అందుకున్న మిరుదొడ్డి సెక్షన్ ఆఫీసర్ మల్లేశం, బీట్ ఆఫీసర్ మధులతలు చిరుత సంచరించిన స్థలాన్ని పరిశీలించి చిరుత పాదముద్రలను గుర్తించిన ఫారెస్ట్ అధికారులు చిరుత  అడుగులేనని ధ్రువీకరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిరుత సంచరించిన పాదముద్రల ప్రకారం చిరుత కొండాపూర్ శివారు నుంచి ఉప్పరపల్లి, అల్మాస్ పూర్ లింగం చెరువు మీదుగా దొమ్మాట అడవిలోకి వచ్చిందన్నారు. చిరుత పులి దొమ్మాట అడవిలోనే ఉన్నదని చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తెలియజేశారు. ప్రజలు ఎవరు ఒంటరిగా వెళ్లవద్దని ఉదయం బోరు బావుల వద్దకు పొలాల వద్దకు వెళ్లే రైతులు ప్రజలు గుంపులుగా  చేతిలో కర్ర పట్టుకుని వెళ్లాలని తెలిపారు.

పొలాల వద్ద పశువులను ఉంచకుండా, ఇండ్ల వద్దకు తెచ్చుకోవాలని రైతులకు తెలిపారు. గొర్రెల మేకల పెంపకం దారులు ఎవరు అడవిలోకి రావద్దని సూచించారు. చిరుత జాడ కోసం దొమ్మాట అడవిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. దొమ్మాట గాజులపల్లి, అల్మాస్ పూర్, ఉప్పరపల్లి, లింగరాజు పల్లి, కోనాయిపల్లి, కొండాపూర్ గ్రామాల ప్రజలకు ఎవరికైనా చిరుత కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ఫారెస్ట్ అధికారులు ప్రజలను కోరారు.