calender_icon.png 18 January, 2026 | 2:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మతసామరస్యానికి ప్రతీక జాన్‌పహాడ్

18-01-2026 12:30:28 AM

మతం పేరిట విద్వేషాలను రెచ్చగొడుతూ స్వప్రయోజనాలను పొందాలని చూసే కొందరు స్వార్థపరుల ఆలోచనలను అణగదొక్కుతూ సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది స్యూర్యాపేట జిల్లాలోని పాలకవీడు మండలం జాన్‌పహాడ్ సైదులు దర్గా. ఇది కృష్ణానది సమీపాన ఉండడంతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ జాన్ పహాడ్ సైదులు బాబా దర్గా ఉర్సుకు సిద్ధమైనది. ఈ నెల 22, 23, 24 తేదీల్లో ఉత్సవాలను వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 400 సంవత్సరాల ఘనమైన చరిత్ర గల దర్గా భక్తుల కోరిన కోర్కెలు తీర్చేదిగా పేరుగాంచింది. దర్గాకు చేరుకోవాలంటే నేరేడు చర్ల పట్టణం నుంచి 19 కిలోమీటర్లు ప్ర యాణించాలి. అదే దామరచర్ల నుంచి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

ఊరు పేరు అలా వచ్చిందే..

ప్రారంభంలో గ్రామంలో అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మాత్రమే ఇండ్లు ఉండేవట. అప్పుడు ఆ ప్రాంతాన్ని జ్ఞానపాడు అని పి లిచేవారని స్థానికులు చెబుతున్నారు. పరిణామ క్రమంలో అదే జానపాడుగా మారి నట్లు తెలుస్తుంది. తర్వాత క్రమంలో ము స్లిం పాలనలో అధికాస్త జాన్ పహాడ్‌గా మారినట్లు చెబుతున్నారు. దీంతో ఈ ఊరు హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నమైంది. 

ఇదీ దర్గా చరిత్ర

400 ఏళ్ల క్రితం మద్రాస్ రాష్ట్రంలో నాగర్ గ్రామంలోని నాగూర్‌షరీఫ్, ఖాదర్ దర్గా విశిష్టతను పక్క రాష్ట్రంలో ప్రచారం చేసేందుకు జానపహాడ్ సైదా, మొహినుద్దీన్ అనే భక్తులు ఊరూరా తిరుగుతున్నా రు. మత ప్రచారంలో తమ వ్యతిరేకులతో పోరాడి అమరులయ్యారని, దాంతో జానపహాడ్ సైదా, మొహినుద్దీన్ జ్ఞాపకార్థం వజీరాబాద్ (వాడపల్లి) రాకుమారుడు దర్గాను నిర్మించారనే కథనాలు వెలుగులో కి వచ్చాయి. దర్గాలో సమాధుల వద్ద నిత్యం ప్రార్థనలు చేయగా ఆ తర్వాత దర్గా విశిష్టత వాడుకలోకి వచ్చింది. జాన్‌పహాడ్ దర్గా వద్ద గొల్ల భామ గుడి, సఫాయిబావి, సిపాయి బాబా సమాధులు, నాగేంద్రుని పుట్ట, నిత్యం వెలిగే దీపం ఉంటాయి. 

గొల్లభామ గుడి 

దర్గా గ్రామ శివారులో గొల్లభామ గుడి ఉన్నది. దీన్ని గొల్లభామ గుట్టగా పిలుస్తారు. దర్గాకు వచ్చే భక్తులకు నీటి ఇబ్బం దులు లేకుండా భూపతి రాజు శేషారెడ్డి కలలోకి సైదులు బాబా వచ్చి గుర్రపు డెక్కలు ఉన్న చోట బావిని తవ్వించాలని చెప్పాడట. ఆ ప్రదేశంలో బావిని తవ్వించగా దానిని సఫాయి బావిగా పిలుస్తున్నారు. భక్తులు ఈ బావి నీటితో పుణ్య స్నానాలు ఆచరిస్తామతసామరస్యానికి ప్రతీక జాన్‌పహాడ్‌రు. ఈ నీటితో వంటలు చేస్తారు. నీటితో స్నానం చేస్తే మానసిక ఆందోళనలు తగ్గుతాయని, నీటిని పంట పొలాలపై చల్లితే అధిక దిగుబడులు వస్తాయని నమ్మకం.

సిపాయి బాబా

సైదులు బాబాకు అంగరక్షకుడిగా ఉండే సిపాయి బాబా(తాళాలస్వామి) కూడా మత ప్రచారంలో భాగంగా సైదులు బాబాతోపాటే మరణించాడని చరిత్ర. దాంతో సైదులు బాబాతోపాటు సిపాయి బాబా దగ్గర కూడా మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ సమాధి చుట్టూ ఉన్న గ్రిల్స్‌కు తాళం వేసి వెళ్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకంతో తాళాల స్వామిగా పిలుస్తారు.

నాగేంద్రుడి పుట్ట

దర్గా లోపలికి వెళ్తే కుడి వైపు నాగేంద్రుని పుట్ట ఉంటుంది. పుట్టలో పాలు పోసి, పసుపు, కుంకుమ, గుడ్లు సమర్పిస్తారు. సంతానం లేని మహిళలు ఈ పుట్ట దగ్గర పూజలు చేస్తే సంతానం కలుగుతుందని నమ్మకం.        

నిత్యం వెలిగే దీపం

దర్గా లోపల సమాధుల తలభాగంలో నిత్య వెలిగే దీపం చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. ఇది 400 సంవత్సరాలుగా వెలుగుతుండడం గమనార్హం. కొత్త ఒత్తులు పెట్టే సమయంలో సైతం అది వెలిగిన తర్వాతే పాతదాన్ని తొలగించేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటారు.                     

కందూరు ప్రత్యేకత

భక్తులు కోరిన కోర్కెలు తీరితే దర్గా వద్ద కందూరు నిర్వహిస్తారు. దీనికోసం భక్తులు బంధుమిత్రులతో కలిసి దర్గాకు వస్తారు. ఇక్కడ యాటలు, కోళ్లను మొక్కులుగా చెల్లించుకుంటారు. సఫాయి బావి నీటితో వంటకాలు చేసుకొని అక్కడే భోజనం చేస్తా రు. దీనినే ఫాతేహగా పిలుస్తారు.

ప్రతియేటా జనవరిలోనే ఉర్సు

సాధారణంగా ప్రతియేటా జనవరి మా సం మూడు, నాలుగు శుక్రవారాల్లో ఉర్సు ప్రారంభమవుతుంది. ఈ ఉత్సవాలు మూ డు రోజుల పాటు జరుగుతాయి. ఉర్సు సందర్భంగా దర్గాను విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. ఉర్సుకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు. ఉర్సులో భాగంగా మొదటి రో జు గుసుల్ షరీఫ్ నిర్వహిస్తారు. దర్గాలోని సైదులు బాబా సమాధులను గంధంతో, నూతన వస్త్రాలు (దట్టీలు), పూలదండలతో అలంకరిస్తారు. దర్గాలో కొవ్వొత్తులతో దీపాలు వెలిగించి బాబాకు నైవేధ్యం సమర్పిస్తారు. ఆ తర్వాత రోజు హైదరాబా ద్‌లోని వక్ఫ్‌బోర్డు కార్యాలయం నుంచి పవిత్ర గంధాన్ని జాన్‌పహాడ్‌లోని సందల్ఖానాకు తీసుకువచ్చి పూజలు నిర్వహిస్తారు. పవిత్ర గంధాన్ని గుర్రంపై ఊరేగించడం ఇక్కడ ఆనవాయితీ. తర్వాత నమాజ్ చేసి బాబా సమాధులపైకి ఎక్కిస్తారు. అనంతరం దర్గాకు వచ్చిన భక్తులకు గంధాన్ని పంచుతారు. చివరి రోజు బాబా సమాధుల వద్ద దీపాలు వెలిగించి (చిరాగా) నైవేధ్యం (ఫాతెహా) సమర్పిస్తారు. 

సైదన్నపై అపార నమ్మకం 

సైదులు బాబాపై ఈ ప్రాంతంలో భక్తులకు అపార నమ్మకం ఉంది. దీంతో తమకు పుట్టే సంతానానికి సైదయ్య, సైదులు, సైదా, సైదమ్మ, సైదయ్య, సైదిరెడ్డి, దర్గయ్య, దర్గారావు, దర్గారెడ్డి వంటి పేర్లు పెట్టుకుంటారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో సుమారు 40 వేల మందికి పైగా ఈ పేర్లతోనే ఉన్నారని ఓ అంచనా.

 --నట్టే కోటేశ్వరరావు, 

సూర్యాపేట (విజయక్రాంతి)