18-01-2026 12:24:57 AM
రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే ఎట్ హోమ్‌కు ఆహ్వానం
‘వ్యవసాయ, వ్యవసాయతేర పనులను సులువుగా చేసుకోవడానికి.. స్థానిక వనరులతో.. తక్కువ ఖర్చుతో..అనువైన పరికరాల సృష్టికర్తగా నిలుస్తున్న మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లికి చెందిన రేపల్లె షణ్ముఖరావుకు 2026 రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొ నేందుకు అరుదైన గౌరవం దక్కింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ఆయనకు ప్రత్యేకంగా ఆహ్వాన పత్రం పంపించగా పోస్టల్ శాఖ అధికారులు ఇటీవల ఆయన నివాస గృహంలో అందజేశారు. ఆహ్వా న పత్రంతో పాటు రాష్ట్రపతి భవన్‌లో పాల్గొనేందుకు గుర్తింపుగా కొన్ని ప్రత్యేక బహుమతులను కూడా పంపించారు.’
విభిన్న రంగాల్లో విశిష్ట సేవలందించే వారిని దేశవ్యాప్తంగా గుర్తిం చి, ఏటా రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా వారిని సత్కరిస్తారు. మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లికి చెందిన రేపల్లె షణ్ముఖరావు ఢిల్లీకి రావాలని ఆహ్వానం అందింది. రేపల్లె షణ్ముఖరావు గత కొన్నేళ్లుగా మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజల ఇబ్బందులను తొలగించడానికి, వ్యవసాయ రంగంలో తక్కువ ఖర్చుతో స్థానిక వనరులతో వ్యవసాయ పరికరాలను రూపొందిస్తూ , అనుసరణీయమైన వస్తువులను అందుబాటులోకి తీసుకువస్తూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఇప్పటికే షణ్ముఖరావు రూపొందించిన అనేక వస్తువులు, పరికరాలు వినియోగిస్తూ తక్కువ ఖర్చుతో సాగులో రైతులు లబ్ధి పొందుతున్నారు. షణ్ముఖరావు రూపొందించిన వివిధ రకాల వ్యవసాయ, వ్యవసాయతర పరికరాలు అనేక జాతీయ, రాష్ట్రస్థాయి పరిదర్శనలో ప్రదర్శించబడ్డాయి.
షణ్ముఖరావు సేవలను గుర్తిం చిన వ్యవసాయ శాఖ, ఇప్పటికే మహబూబాబాద్ మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం సాంకేతిక కమిటీ సభ్యుడిగా ఆయనను నియమించిం ది. నిరంతరం తన సరికొత్త ప్రయోగాలతో తక్కువ ఖర్చుతో, ఎక్కువ ఉపయోగం అయ్యే పరికరాలను, వస్తువులను రూపొందించే కార్యక్రమాలను కొనసాగిస్తూ షణ్ముఖరావు సరికొత్త ప్రయోగాలకు సృష్టికర్తగా పేరు గడించారు. దక్షిణ భారతదేశ నుంచి రిపబ్లిక్ దినోత్సవం వేడుకల్లో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఏకైక వ్యక్తిగా షణ్ముఖరావు నిలవడం మరోవిశేషం. ఎలాంటి లాభాపేక్ష లేకుండా షణ్ముఖరావు రూపొందించే పరికరాలు, వస్తువులను సొంతంగా తయారు చేసుకునే విధంగా ఉండడం ఆయన ప్రత్యేకతగా నిలుస్తోంది. తాను రూపొందించిన అనేక ప్రయోగాత్మక పరికరాలను, వస్తువులను దేశవ్యాప్తంగా ప్రదర్శనలకు తీసుకెళ్లి, ప్రజలకు, రైతులకు తక్కువ ఖర్చుతో వినియోగించే విధంగా వివరిస్తున్నారు.
ఆచరణీయమైన ఆవిష్కరణలు..
షణ్ముఖరావు 10వ తరగతి వరకు చదివినప్పటికీ, స్వయంగా నేర్చుకుని ఇంజినీరింగ్ నైపుణ్యాలతో అనేక ఆవిష్కరణలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మానవ శ్రమను తగ్గించడం, ఖర్చులను తగ్గించడం లక్ష్యంగా అతని ఆవిష్కరణలు రూపొందాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకు ఉపయోగకరమైనవి. షణ్ముఖరావు మూడుసార్లు ‘బెస్ట్ ఇన్నోవేటర్ అవార్డు’ గెలుచుకున్నాడు. ఐఐటీ హైదరాబాద్ ద్వారా సత్కరించబడ్డాడు. అతని ఆవిష్కరణలు షణ్ముఖ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మార్కెటింగ్ అవుతున్నాయి. అతను రూపొందించిన వివిధ రకాల వస్తువుల్లో ప్రధానంగా వ్యవసాయం, గ్రామీణ జీవనం, మానవ శ్రమ తగ్గింపుకు సంబంధించినవి ఉండడం గమనార్హం.
పవర్ వీడర్ (మాన్ రైడింగ్ పవర్ వీడర్, బ్రష్ కట్టర్, షేడ్ ప్లౌ (షేడ్ ఫర్ ఫామ్ లేబర్), ఎకనామికల్ డిష్వాషర్ (క్లీనింగ్ మెషిన్), కౌ డంగ్ ఇన్సెన్స్ స్టిక్స్, కమ్యూనిటీ అంబ్రెల్లా, రోడ్ క్లీనర్, డోలీ అంబులెన్స్, తదితర ఎన్నో పరికరాలను మానవ శ్రేయస్సు, కర్షకుల శ్రమను తగ్గించేందుకు, రైతులకు ఉపయుక్తంగా ఉండేలా సృష్టించారు. అతని కంపెనీ షణ్ముఖ ఇన్నోవేషన్స్ ద్వారా ఐఐఎస్సీ బెంగళూరు అభివృద్ధి చేసిన హ్యాండ్‌హెల్ పీసీఆర్ డివైస్ (మొక్కల ఫంగస్ గుర్తించడానికి) తయారీకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అయింది. ఇది మొక్కల వ్యాధులను ముందుగా గుర్తించి, పంట నష్టాలను తగ్గిస్తుంది. అతని ఆవిష్కరణలు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ లేదా తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ద్వారా లభిస్తాయి.
బండి సంపత్ కుమార్, మహబూబాబాద్, విజయక్రాంతి
జాతీయస్థాయి గుర్తింపు సంతోషకరం
తక్కువ ఖర్చుతో వ్యవసాయ పనిముట్లు, ఇతర పనులకు వినియోగించే పరికరాలను రూపొందించి, ప్రజలు, రైతులకు తక్కువ శ్రమ, పెట్టుబడి తగ్గించడం కోసం స్థానిక వనరులతో పరికరాలను రూపొందించడం జరుగుతుంది. నేను రూపొందించిన పరికరాన్ని స్థానికంగానే సులువుగా ప్రతి ఒక్కరూ తయారు చేయించుకోవచ్చు. అలాగే తమకు అణువుగా వాటిని చేర్పులు మార్పులు చేసుకోవచ్చు. నేను తయారుచేసిన అనేక పరికరాలు నిరంతరం ప్రజలకు, రైతులకు ఉపయోగపడుతున్నాయి. నిరంతరం ప్రయోగాలను కొనసాగిస్తూనే ఉన్నాను. ఇప్పటికే జాతీయ స్థాయితో పాటు రాష్ట్రస్థాయిలో అనేక అవార్డులు అందుకున్నాను. ఇప్పుడు రాష్ట్రపతి భవన్ నుంచి అరుదైన ఆహ్వానం అందడం సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ స్ఫూర్తితో మరిన్ని ఆవిష్కరణలకు కృషి చేస్తాను.
రేపల్లె షణ్ముఖరావు, వ్యవసాయ, వ్యవసాయేతర పరికరాల సృష్టికర్త,
కంబాలపల్లి, మహబూబాబాద్ జిల్లా