calender_icon.png 18 January, 2026 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖమ్మంలో సీపీఐ శతాబ్ది ఉత్సవాలు

18-01-2026 01:03:40 AM

  1. దేశ నలుమూలల నుంచి నాయకులు,  కార్యకర్తలు తరలివస్తారు
  2. రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడం ఎమ్మెల్యే సాంబశివరావు

ఖమ్మం, జనవరి 17 (విజయక్రాంతి): సీపీఐ శతాబ్ది ఉత్సవాలను ఖమ్మం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ (ఎస్‌ఆర్‌అండ్ బిజిఎన్‌ఆర్) కళాశాలలో నిర్వహించబోతున్నారు. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి ముఖ్య నాయకులు, కార్యకర్తలు తరలివస్తారని, పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడం ఎమ్మెల్యే సాంబశివరావు తెలిపారు. ఈ సందర్భంగా విజయక్రాంతి దినపత్రికతో ఆయన ముచ్చటించారు. 

కమ్యూనిజాన్ని భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా అనువర్తింప జేసేందుకు నిర్ణయాలు ఉంటాయా? 

పరిస్థితులకు అనుగుణంగా సీపీఐ మారుతూనే వస్తోంది. అన్ని నిర్బంధాలను తట్టుకొని ఉండబట్టే వందేళ్లయినా పార్టీ క్రియాశీలకంగా ఉంటోంది. అయితే మెజారిటీ మతానిదే రాజ్యం, మెజారిటీ కులాలదే అధికారం అనకపోవడం వల్లే మాకు ఈ అపప్రద. మత మౌఢ్యానికి, మూఢ నమ్మకాలకు దూరంగా ఉంటూనే, ప్రజల ఆచార వ్యవహారాలను మేము గౌరవిస్తూనే ఉన్నాం. ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా, ప్రజల సెంటిమెంట్లకు అనుగుణంగా మా పార్టీని అనువర్తింప చేసుకుంటూ ముందు వెళతాం.

మెజారిటీ మతంలోని లోపాలను బూచిగా చూపుతూ తమ అస్తిత్వం కాడుకుంటున్నారనే విమర్శ కమ్యూనిస్టులపై ఉన్నదా?

మతాన్ని బూచిగా చూపి అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలనుకునే వాళ్లం అయితే ఎప్పుడో అధికారంలోకి వచ్చేవాళ్లం. అన్ని మతాల్లోని మూఢనమ్మకాలను ఖండిస్తున్నాం. హిందూమతం మెజారిటీ కాబట్టి, ఆ మతంలో నిర్హేతుకంగా జరిగే విషయాలు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తుంటాయి. వాటి పైన విమర్శలు ఎక్కుపెడుతుండేసరికి, మేము హిందువులకు వ్యతిరేకం అనే భావన కలుగుతోంది. కానీ అది అవాస్తవం. 

కమ్యూనిస్టులకు మధ్యతరగతి, నిరుద్యోగ, రైతు కూలీలు దూరమయ్యారా?

ప్రాంతీయ, కుల పార్టీలు వచ్చేసరికి మధ్యతరగతి ఓటు బ్యాంకు మొత్తం చీలిపోయి మాకు దూరమైంది. యువత ఫలానా పని మాత్రమే చేయాలని కూర్చోకుండా దొరికిన పనితో అంటే, డెలివరీ లేదా పికప్  డ్రైవర్ల గానో కుదిరిపోయి సంతృప్తి పడుతున్నారు. గిగ్ వర్కర్లు అంటారు. అలాగే రైతు కూలీలు కూడా తమకు అనువైన పనుల్లో కుదిరిపోతున్నారు. పరిస్థితులు మారినా పని గంటలు, ఉద్యోగ భద్రత వంటి విషయాలు మారలేదు. ఇలా అసంఘటితరంగాల్లో ఉన్న కోటికి పైగా కార్మికులు ఉన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు మేము ఎప్పుడూ చేయలేదు.

వారు మాకు దూరమైనా, వారికి మేలు చేకూరేలా భిన్న రంగాల్లోని వర్కు ఫోర్సుని ఆయా సంఘాల కిందకు తీసుకువచ్చి వారికి మేలు చేకూర్చే ఉద్యమాలను నిర్మిస్తాం. ఇప్పటికే గిగ్ వర్కర్లకు సమస్య గురించి అసెంబ్లీలో మాట్లాడు తున్నాం. వారి కోసం ఓ సంఘాన్ని ఏర్పాటు చేసి, వారి ఉద్యోగ విషయంలో సమస్యలను, ఇబ్బందులను దూరం చేసే కార్యచరణ రూపొందించబోతున్నాం.

పెట్టుబడిదారీ సామ్రాజ్యవాదం అని మాట్లాడే అభివృద్ధి నిరోధకులు కమ్యూనిస్టులు అనే ప్రచారం ఉంది?

పరిశ్రమలను కంపెనీలను అభివృద్ధిని ఏ రోజు అడ్డుకోలేదు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను, పరిశ్రమలను ప్రైవేటుపరం చేయొద్దంటున్నాం. ఎల్‌ఐసి, బొగ్గు, ఉక్కు పరిశ్రమలు, బ్యాంకింగ్ సెక్టార్లు లాభాల్లో ఉన్నాయి. ఇలాంటి వాటిని ప్రైవేటు పరం చేస్తే లక్షల మంది ఉద్యోగులకు భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అలాగే కొత్త పరిశ్రమలు వచ్చినప్పుడు అప్పనంగా భూములు కట్టబెట్టే విధానాలను వ్యతిరేకిస్తాం. ఇలాంటి వాటిని అడ్డుకోకపోతే సంపద అంతా ఒకరివద్దే పోగుపడి అసమానతలు పెచ్చరిల్లుతాయి. ఇవేమీ ఆలోచిం చని ప్రభుత్వాలు మమ్మల్ని అభివృద్ధి నిరోధకలుగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. 

దేశంలో కుల ప్రాముఖ్యాన్ని తగ్గించటంలో కమ్యూనిస్టులు చేతులెత్తేశారా?

కమ్యూనిజం ఈ దేశంలోకి వచ్చిన తర్వాతే కుల అసమానతలు అస్పృశ్యతలు తగ్గాయి. సంపద పంపిణీ, ఆర్థిక అసమానతలు తగ్గిపోతే కులం మాయమవుతుంది అనుకున్నాం. వర్గ పోరాటంలో కులం కలిసి పోతుందని భావించాం. మా అంచనా తప్పయింది. కులం రాజకీయ సాధనంగా మా రింది. ఇది రాజకీయపరమైన కుల విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. దీనిని మొదట్లో నే  గుర్తించి, వర్గపోరాటానికి ఆపాదించి ఉంటే కుల సమస్యకు కమ్యూనిస్టులు ఓ శాశ్వత పరిష్కారాన్ని కనుగొనేవారు. ఈ విషయాన్ని గుర్తించటంలో విఫలమయ్యాం. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీపీఐ మరింత బలహీన పడిందా?

ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పరిస్థితులను బట్టి ఆయా పార్టీలు మాతో పొత్తుకు దిగేవి. దీంతో ఎన్నికల బరిలో ఓట్లు సీట్లు మాకు ఉండేవి. కమ్యూనిస్టులు మొదట విశాలాంధ్రకు మద్దతు పలికినా.. ఆరేడు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను చూసి తెలంగాణ ఏర్పాటుకు ఆమోదం తెలిపాం. దీనివ ల్ల పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా, ప్రజల సెంటిమెంటును గౌరవించాం. తెలంగాణ రాష్ట్రం తర్వాత ఓట్లు, సీట్ల విషయంలోనే వెనకపడ్డాం తప్పించి, ప్రజలు మాకు తెలిపే మద్దతు విషయంలో బలంగానే ఉన్నాం. 

మార్క్సిస్టు, లెనినిస్టు, మావోయిస్టు, రివిజనిస్టులుగా విడిపోవటం నష్టం చేకూర్చిందా? 

కమ్యూనిస్టులు ఇన్ని రకాలుగా విడిపోవడం వల్ల ప్రజల్లో అపనమ్మకం ఏర్పడడం అనేది వాస్తవం. వారికి న్యాయం చేయలేమనే భావన కూడా ఏర్పడే అవకాశం ఉంది. కమ్యూనిస్టులంతా ఏకం అయితేనే ప్రజల్లో విశ్వాసం ఏర్పడుతుంది. అలా కాకుండా ఎవరికి వారే ఉద్యమాలు చేస్తూ ముందుకు సాగినా, ఓ నిర్ణయాత్మక శక్తిగా మారలేము అనేది కూడా వాస్తవం.

రాబోయే 50 ఏళ్లలో బలమైన రాజకీయ శక్తిగా మారుతుందా?

కమ్యూనిజం నిరంతరం సాగే ఓ ప్రవా హం. నిర్దిష్ట కార్యచరణ పెట్టుకుని ఫలానా సమయానికి ఇలా ఉండాలి, పలానా సమయంలో ఈ స్థాయికి చేరాలి అనే ఉద్దేశం ఏమీ లేదు. ప్రతి మూడేళ్లకు ఓసారి జరిగే మహాసభలో నిర్ణయాలు తీసుకుంటాం. పరిస్థితులకు అనుగుణంగా ఎత్తుగడలు వేస్తూ, ప్రజా ఉద్యమాలను నిర్మించి స్థానిక సంస్థల్లో బలం పెంచుకొంటూ ముందుకు సాగుతాం.