calender_icon.png 14 November, 2025 | 12:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జయహో అశ్విన్

19-12-2024 12:26:45 AM

  • అంతర్జాతీయ క్రికెట్‌కు భారత స్పిన్నర్ వీడ్కోలు
  • 14 ఏళ్ల కెరీర్‌లో మూడు ఫార్మాట్లు కలిపి 765 వికెట్లు
  • అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా రికార్డు

టెస్టుల్లో అత్యంత వేగంగా 250, 300, 350 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి క్రికెటర్‌గా రికార్డు.

గబ్బా వేదికగా మూడో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. సంప్రదాయం ప్రకారం ఇరుజట్ల కెప్టెన్లు ప్రెస్ కాన్ఫరెన్స్‌కు రావడం ఆనవాయితీ. ఎప్పటిలాగే కెప్టెన్ రోహిత్ శర్మ రాగా.. ఆ వెనకాలే ఎప్పుడు రాని రవిచంద్రన్ అశ్విన్ కూడా వచ్చాడు. ఎందుకు వచ్చాడనుకునేలోపే మైక్ తీసుకున్న అశ్విన్ తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 

దీంతో భారత క్రికెట్‌లో ఒక శకం ముగిసినట్లయింది. తన ఆఫ్ స్పిన్‌తో ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టిన అశ్విన్ ఇకపై గ్రౌండ్‌లో కనిపించడు అంటే ఏదో తెలియని వెలితి. అతడి స్థానాన్ని భర్తీ చేయడం కష్టతరమైనప్పటికీ ఎప్పటికైనా రిటైర్ అవ్వాల్సిందే కాబట్టి ఆ సమయం ముందే వచ్చిందనుకొని సర్దిచెప్పుకోవాల్సిందే. అల్విదా అశ్విన్..

అశ్విన్ సాధించిన రికార్డులు

  1. టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్ అశ్విన్ (537 వికెట్లు). కుంబ్లే (619) తొలి స్థానంలో ఉన్నాడు.
  2. టెస్టుల్లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ (11 సార్లు) అవార్డులు అందుకున్న ఆటగాడిగా అశ్విన్ చరిత్ర.
  3. ఒకే టెస్టులో సెంచరీతోపాటు 5 వికెట్ల ప్రదర్శన నాలుగు సందర్భాల్లో చేసిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు.
  4. టెస్టుల్లో 3వేల పరుగులు, 500కు పైగా వికెట్లు తీసిన మూడో ఆల్‌రౌండర్‌గా అశ్విన్ రికార్డు.

బ్రిస్బేన్: భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బుధవారం అంతర్జాతీయ క్రికె ట్‌కు వీడ్కోలు పలికాడు. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బా వేదికగా మూడో టెస్టు డ్రాగా ముగిసిన వెంటనే అశ్విన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. దీంతో 14 ఏళ్ల పాటు ఆఫ్ స్పిన్నర్‌గా టీమిండియా కు వెన్నుముకలా నిలిచిన అశ్విన్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్ పడినట్లయింది. 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన 38 ఏళ్ల రవిచంద్రన్ అశ్విన్ భారత్ తరఫున 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

మూడు ఫార్మాట్లు కలిపి 765 వికె ట్లు ( టెస్టుల్లో 537, వన్డేల్లో 156 , టీ20ల్లో 72) పడగొట్టాడు. టెస్టుల్లో 37 సార్లు ఐదు వికెట్ల హాల్ నమోదు చేసిన అశ్విన్ దిగ్గజా లు షేన్ వార్న్, మురళీధరన్ తర్వాత అత్యధిక ఐదు వికెట్ల హాల్ నమోదు చేసిన బౌల ర్‌గా రికార్డులకెక్కాడు. ఇక టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఓవరాల్ జాబితాలో అశ్విన్ ఏడో స్థానంలో ఉన్నాడు.

బౌలింగ్ మాత్రమే కాకుండా అవసరమైనప్పుడు తనలోని బ్యాటర్‌ను వెలికి తీశాడు. ముఖ్యంగా టెస్టుల్లో చాలా సందర్భాల్లో భారత్‌కు ఆపద్భాందవుడయ్యాడు. టెస్టుల్లో 25 సగటుతో 106 మ్యాచ్‌ల్లో 3503 పరుగులు సాధించిన అశ్విన్ ఖాతాలో ఆరు సెంచరీలు, 14 అర్థశతకాలు ఉన్నాయి. 

ఐసీసీ టోర్నీల్లో తనదైన ముద్ర

ఐసీసీ టోర్నీల్లోనూ అశ్విన్‌కు మెరుగైన రికార్డు ఉంది. వన్డే క్రికెట్‌లో భారత్ సాధించిన ఐసీసీ ట్రోఫీల్లో అశ్విన్‌ది కీలకపాత్ర. 2011 వన్డే ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టు లో సభ్యుడిగా ఉన్నాడు. ఆ తర్వాత 2013 చాంపియన్స్ ట్రోఫీ సాధించడంలోనూ అశ్విన్ ప్రముఖపాత్ర పోషించాడు. 2010, 2016 ఆసియా కప్ గెలిచిన జట్టులోనూ భాగస్వామ్యమయ్యాడు. గతేడాది 2023 వన్డే ప్రపంచకప్‌తో పాటు 2017 చాంపియన్స్ ట్రోఫీ, 2014 ఐసీసీ టీ20 టోర్నీ, 2019 2021 డబ్ల్యూటీసీ చాంపియన్‌షిప్ టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచిన భార త్ జట్టులోనూ అశ్విన్ సభ్యుడిగా ఉన్నాడు.

లెఫ్ట్ హ్యాండర్ల పాలిట సింహస్వప్నం..

ప్రతీ బౌలర్‌కు ఒక ప్రత్యేకత ఉండ డం సహజం. ఆఫ్ స్పిన్నర్ అయిన అశ్విన్ లెఫ్ట్ హ్యాం డర్ల పాలిట సింహస్వప్నంలా మారా డు. ముఖ్యంగా అశ్విన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి ఎడమచేతి వాటం బ్యాటర్లు వణికి పోయేవారు. టెస్టుల్లో అశ్విన్ 268 సార్లు లెఫ్ట్ హ్యాండర్ల వికెట్లను పడగొట్టడం ఇప్పటికీ రికార్డుగా మిగిలిపోయింది. మీడియం పేసర్ నుంచి స్పిన్నర్‌గా కెరీర్ టర్న్ తీసుకున్న అశ్విన్‌కు తెలివైన క్రికెటర్ అని పేరుం ది. ఇంజనీరింగ్ చదివిన అశ్విన్ తన చిన్ననాటి స్నేహితురాలు ప్రీతి నారాయణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు ఇద్దరు కూతుర్లు.

ధోనీ నమ్మిన బంటు..

24 ఏళ్ల వయసులో భారత క్రికెట్‌లో కి ఎంట్రీ ఇచ్చిన అశ్విన్ ధోని కెప్టెన్సీలో ఆరితేరాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్ (2008)లో ధోనీతో కలిసి చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన అశ్విన్ అప్పుడే మాజీ కెప్టెన్‌కు ఆప్తమిత్రుడయ్యాడు. ముఖ్యంగా ధోనీకి అశ్విన్‌పై ఉన్న అపార నమ్మకమే అతన్ని లెజెండరీ స్పిన్నర్‌గా తీర్చిదిద్దింది. ఉపఖండంలో జరిగిన టెస్టు సిరీస్‌ల్లో దాదాపు అన్ని మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టాడు.

సమకాలీన క్రికెట్‌లో అశ్విన్ ద్వయం అత్యంత విజయవంతమైన జోడీ. ముఖ్యంగా భారత్‌లో జరిగిన టెస్టు సిరీస్‌లు టీమిండి యా గెలవడంలో ఈ ఇద్దరిది కీలకపాత్ర. ఈ ఏడాది వరకు ఈ ఇద్దరు కలిసి 45 టెస్టులు ఆడి జట్టుకు 34 విజయాలు అందించారు. స్వదేశంలో అశ్విన్ 263 వికెట్లు తీయగా.. జడ్డూ 218 వికెట్లు పడగొట్టాడు. కుంబ్లే జోడీ 34 టెస్టుల్లో 14 విజయాలు సాధించింది. 

రిటైర్మెంట్‌కు కారణం అదేనా?

ఇంత ఆకస్మాత్తుగా అశ్విన్ రిటైర్మెంట్ ఇవ్వడం వెనుక ఒకే ఒక్క కారణముంది. ఈ మధ్య కాలంలో అశ్విన్ పాత్రను జడేజా సమర్థంగా పోషిస్తుండడం.. సుందర్, అక్షర్ లాంటి క్రికెటర్లు సత్తా చాటడం అశ్విన్‌కు జట్టులో చోటు దక్కడం లేదు. ఇదే సరైన సమయమని భావించిన అశ్విన్ బోర్డర్‌గావస్కర్ సిరీస్ మధ్యలోనే వీడ్కోలు పలికాడు. గతంలో ధోనీ, కుంబ్లే కూడా ఆసీస్‌తో సిరీస్ సందర్భంగా రిటైర్మెంట్ ప్రకటించడం విశేషం.

మన్కడింగ్‌కు కేరాఫ్ అడ్రస్

మన్కడింగ్ అనే పదం వినగానే మొదటగా గుర్తుకొచ్చేది రవిచంద్రన్ అశ్విన్. ఐపీఎల్‌లో రాజస్థాన్ ఆటగాడు జాస్ బట్లర్‌ను మన్కడింగ్ (నాన్ స్ట్రుక్ ఎండ్‌లో ఔట్ చేయడం) చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. అశ్విన్ ప్రవర్తనపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చినప్పటికీ తాను చేసింది కరెక్టే అన్న అభిప్రాయం బలంగా వినిపించాడు. కాగా ఇటీవలే మన్కడింగ్ పదాన్ని క్రికెట్‌లో చట్టాలు తెచ్చే మెరిల్‌బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) చట్టబద్ధం చేయడం విశేషం.