08-07-2025 01:01:59 AM
ముగ్గురు నిందితులు అరెస్టు వివరాలు వెల్లడించిన బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి
కుత్బుల్లాపూర్, జులై 07(విజయ క్రాంతి): దొంగతనాలు చేసిన సొమ్మును ఆన్లైన్ బెట్టింగ్ లో ఇన్వెస్ట్ చేస్తున్న నిందితులను జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు.జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి వివరాలు వెల్లడించా రు. జీడిమెట్ల ఎస్సార్ నాయక్ నగర్ కు చెందిన సంగమేష్ ఈనెల 2వ తేదీన పటాన్చెరు లో ఫంక్షన్ హాల్ కు వెళ్ళాడు.
రాత్రి తిరిగి రావడానికి రాత్రి అవుతుందని,ఇంటి తలుపులకు తాళం వెయ్యొద్దని తన కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలియజేశాడు.ఈ విషయాన్ని తన వద్ద పని చేస్తున్న ఆసిఫ్ విని, అదే అదునుగా భావించి తన స్నేహితులు మహమ్మద్ ఆసిఫ్, మహమ్మద్ అమీర్ లను సంగమేశ్ ఇంటికి రమ్మన్నాడు. రాత్రి తలుపులు తాళం వేయకుండా దగ్గరికి వేసి ఉండటంతో ఇంట్లో ఉన్న మూడున్నర లక్షల రూపాయలతో పాటు ఒక ఫోను దొంగలించి పరారయ్యారు.
వీరు పారిపోతున్న క్రమంలో సంగమేశ్ కూతురు రిషిక చూసి, సంగమేష్ ఇంటికి వచ్చిన తర్వాత జరిగిందంతా తండ్రికి తెలిపింది. దీంతో 3వ తేదీన సంగమేష్ జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు ప్రారంభించి సీసీ కెమెరాలు పరిశీ లించారు. దొంగతనంలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నట్లుగా అందులో ఒక వ్యక్తి సంగమేష్ దగ్గర పనిచేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
దొంగలించిన మొబైల్ ఫోన్ ని అమ్మడానికి నిందితులు ద్విచక్ర వాహనంపై షాపూర్ నగర్ కి వచ్చారు. అదే సమయంలో వాహన తనిఖీలు చేస్తు న్న క్రమంలో నిందితుల వాహనాన్ని ఆపి ప్రశ్నించగా డాక్యుమెంట్స్ సరిగ్గా లేవని అనుమానంతో పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించగా దొంగతనాన్ని ఒప్పుకున్నారు. నిందితుల వద్ద నుంచి 2 లక్షల 15 వేల రూపాయలు, నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించామని ఏసీపీ నరేష్ రెడ్డి తెలిపారు.