08-09-2025 01:22:47 AM
గిరిజన హక్కుల సంఘం రాష్ట్ర కన్వీనర్ బానోతు రామారావు
ముషీరాబాద్, సెప్టెంబర్ 7(విజయక్రాంతి): గిరిజనులను నిర్వాసితులను చేసే జీవో నెంబర్ 49 ని పూర్తిగా రద్దు చేయాలని గిరిజన హక్కుల సంఘం రాష్ట్ర కన్వీనర్ బానోతు రామారావు, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగ య్యలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 3ను వెంటనే ఏజెన్సీ ప్రాంతం లో పునరుద్ధరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు ఆదివారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గిరిజన హక్కుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సంఘం రాష్ట్ర కన్వీనర్ బానోతు రామారావు, విద్యావంతుల వేదిక అధ్యక్షులు అంబటి నాగయ్యలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీలో పిసా చట్టం ప్రకారం గ్రామ సభలు పెట్టకుండానే ఏకపక్షంగా 339 గ్రామాలకు అన్యా యం చేస్తూ అక్రమంగా జీవో నెంబర్ 49 తీసుకువచ్చిందన్నారు.
ప్రజా ఉద్యమాలతో రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 49 తాత్కాలికంగా నిలుపుదల చేసిందని, ఈ జీవో నెంబర్ 49 పూర్తిస్థాయిలో రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. పులుల సంరక్షణ, అడవుల సంరక్షణ పేరుతో గ్రామాలను ఖాళీ చేయించి తర్వాత అటవీ భూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే గిరిజనులను ఇతర పేదలను అడవికి దూరం చేయడం ఈ జీవో యొక్క ముఖ్య ఉద్దేశ్యమన్నారు.
ఈ కార్యక్రమంలో గిరిజన హక్కుల సంఘం కో- కన్వీనర్లు ఇస్లావత్ తిరుపతి నాయక్, భూక్య శ్రీనివాస్, మాలోతు బాలు నాయక్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎట్టి ప్రశాంత్, బానోతు సంతోష్, మాదాసు శివ తదితర నాయకులు పాల్గొన్నారు.