04-12-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో డిసెంబర్ 3 (విజయక్రాంతి): సంచలనం సృష్టించిన పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే రెండుసార్లు కస్టడీకి తీసుకుని విచారించిన పోలీసులు.. తాజాగా కోర్టులో అతడిని హాజరుపరిచారు. ఈ క్రమంలో రవి నాంపల్లి కోర్టులో మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల కస్టడీ విచారణలో రవి తన టెక్నికల్ స్కిల్స్ గురించి వివరించినట్లు తెలిసింది.
అతడి నైపుణ్యాన్ని గమనించిన పోలీసులు.. సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేస్తావా అని బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. అయితే, రవి మాత్రం పోలీసుల ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. తనకు ఆసక్తి లేదని చెప్పినట్లు సమాచారం. గతంలో కరేబియన్ దీవుల్లో తలదాచుకున్న రవి.. జైలు నుంచి బయటకు వచ్చాక తన భవిష్యత్ ప్రణాళికను కూడా పోలీసులకు వివరించినట్లు తెలిసింది.
తిరిగి కరేబియన్ దీవులకే వెళ్లిపోతానని, అక్కడ ఐబొమ్మ పేరుతోనే రెస్టారెంట్ బిజినెస్ పెడతానని చెప్పినట్లు సమాచారం. ఐబొమ్మ వెబ్‌సైట్ ద్వారా ఇప్పటివరకు తాను సుమారు రూ. 17 కోట్లు సంపాదించినట్లు రవి విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. అయితే, ఆ డబ్బంతా జల్సాలకు, ఎంజాయ్ చేయడానికే ఖర్చు చేశానని చెప్పడం కొసమెరుపు. ప్రస్తుతం అతడి ఖాతాలో ఉన్న రూ. 3 కోట్లను పోలీసులు ఇప్పటికే సీజ్ చేశారు.