04-12-2025 12:00:00 AM
పాకిస్థాన్ త్రివిధ దళాల అధిపతి ఆసిమ్ మునీర్‌పై ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మునీర్ ఒక ఇస్లామిక్ ఛాందసవాది అని, భారత్‌తో యుద్ధం కోసం తహతహలాడుతున్నారని పేర్కొన్నారు. అయితే మునీర్‌పై ఇలాంటి ఆరోపణలు రావడం కొత్తేమీ కాదు. త్రివిధ దళాల అధిపతిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మునీర్ మాటలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.
వీలు చిక్కినప్పుడల్లా మునీర్ భారత్‌పై మాటల రూపంలో విషం చిమ్ముతూనే వస్తున్నారు. గత అక్టోబర్‌లో పాకిస్తాన్ మిలటరీ అకాడమీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆసిమ్ మునీర్.. భారత్ నుంచి రెచ్చగొట్టే చర్యలు ఎంత చిన్నగా ఉన్నా పాకిస్థాన్ ఊహించని విధంగా నిర్ణయాత్మక జవాబిస్తుందని బీరాలు పలికారు. పాక్ తన శక్తి సామర్థ్యాలను పెంచుకుంటుందని, భారత భౌగోళిక భద్రతను దెబ్బతీయగలమన్నారు.
అమెరికా పర్యటన సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మునీర్‌కు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలకడంతో ఆయన మరింత రెచ్చిపోయారు. తమది అణ్వాయుధ దేశమని, అవసరమైతే అణు యుద్ధానికి దిగుతామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఒకవేళ తాము నాశనమవుతుంటే తమతో పాటు సగం ప్రపంచాన్ని పతనం వైపుకు తీసుకెళ్తామంటూ మునీర్ ప్రేలాపనలు చేశారు. అంతేకాదు సింధూ నది జలా లపై కూడా మునీర్ విషం చిమ్మాడు.
సింధూ నదిపై భారత్ డ్యామ్‌లు నిర్మించే వరకు ఎదురుచూస్తామని, వాళ్లు కట్టే ఆనకట్టలను పేల్చేందుకు మా వద్ద అణు క్షిపణులకు కొదువ లేదంటూ వితండవాదం చేయడం గమనార్హం. ఇక పహల్గాం ఉగ్రదాడికి ముందు కూడా మునీర్ ‘కశ్మీర్ తమ జీవనాడి’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అయితే మునీర్ పిచ్చి వ్యాఖ్యలపై భారత్ ఎప్పటికప్పుడు ధీటుగా బదులిస్తూనే వచ్చింది. ఇమ్రాన్ సోదరి అలీమా ఖాన్ మునీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం సబబుగానే అనిపిస్తుంది.
ఎందుకంటే మునీర్, ఇమ్రాన్ ఖాన్‌ల మధ్య వైరం ఇప్పటిది కాదు. 2018లో పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ అతిపెద్ద పార్టీగా అవతరించడంతో ఇమ్రాన్ ప్రధాని పదవిని చేపట్టారు. ఆ సమయంలో ఆసిమ్ మునీర్ ఐఎస్‌ఐ డీజీగా జనరల్ పదవిలో ఉన్నాడు. అయితే ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ, ఆమె సర్కిల్ చుట్టూ వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తుకు మునీర్ ఆసక్తి చూపారు.
ఇది ఇమ్రాన్‌కు నచ్చక మునీర్‌ను ఐఎస్‌ఐ డీజీ పదవి నుంచి తొలగించినట్లు సమాచారం. ఆ తర్వాత విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో పదవిని కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్, అవినీతి ఆరోపణల కేసుల్లో దోషిగా తేలి 2023 ఆగస్టు నుంచి జైల్లోనే మగ్గుతున్నారు. తాజాగా ఇమ్రాన్‌ఖాన్ జైలు నుంచి బయటకు రాకుండా ఆసిమ్ మునీర్ పరోక్షంగా అడ్డుపడుతున్నారన్న వాదన బలంగా వినిపిస్తున్నది.
పాకిస్థాన్ రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో సైన్యం ప్రభావం, పెత్తనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. సైన్యం ఆశీస్సులు, అండదండలు లేని నాయకులు పాతాళానికి పడిపోవాల్సిందే. హద్దులు దాటొద్దని సైన్యానికి చెప్పినందుకు నవాజ్ షరీఫ్‌కు, సైన్యం పెత్తనాన్ని ప్రశ్నించినందుకు ఇమ్రాన్‌లకు ఎలాంటి గతి పట్టిందో అందరికీ తెలిసిందే. కుతంత్రాల మునీర్ మాటల పట్ల భారత్ అప్రమత్తంగా ఉండాలి.