30-08-2025 12:00:00 AM
టీచర్ కొలువు నుంచి ఉద్వాసన
జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 29 (విజయ క్రాంతి): తప్పుడు విద్యార్హతలతో టీచర్ కొలువు దక్కించుకున్న ఉపాధ్యాయుడు, ధ్రువీకరణ సమయంలో ‘నకిలీ’ పత్రాలని తేలగా సంబంధించిన సర్టిఫికెట్స్ సమర్పించకుండా, విధులకు గైర్హాజర్ అయిన ఉపాధ్యాయున్ని ఉద్యోగం నుంచి తొలగించినట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా విద్యాధికారి రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. డీఈవో కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
1996 డీఎస్సీ ద్వారా సెకండరీ గ్రేడ్ టీచర్ గా ఎంపికైన ఎం.కృష్ణమాచారి బిఎడ్ డిగ్రీ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పొందినట్లు సమర్పించి ఉద్యోగాన్ని పొందాడు. విద్యార్హతకు సంబంధించి సమర్పించిన డిగ్రీని విచారణ సమయంలో అధికారులు ధ్రువీకరణకు పంపగా ఆంధ్ర విశ్వవిద్యాలయం పరీక్ష నియంత్రకులు అతని సర్టిఫికెట్ నకిలీ అని ధ్రువీకరించారు.
నకిలీ సర్టిఫికెట్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందడం చట్ట పరంగా చెల్లదని, ఈ విషయంపై కృష్ణమాచారి అనధికారికంగా విధులకు హాజరుకాకుండా, సర్టిఫికెట్ కు సంబంధించిన విషయంలో మోసం చేసినట్లు గుర్తించి నియమాల ఉల్లంఘనతో సేవను పరిత్యజించినట్లుగా భావించి సర్వీస్ రూల్స్ 1991, నియమం 9(స) ప్రకారం అతడిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు డిఇఓ వెల్లడించారు.