26-08-2025 02:18:52 AM
అర్మూర్, ఆగస్టు 25, (విజయ క్రాంతి) : ఆర్మూర్ నియజకవర్గానికి చెందిన బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యురాలు విజయభారతి తన అనుచరులతో కలిసి బి.ఆర్.ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జిల్లా అధ్యక్షుడు, అర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశాన్నగారి జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్ లో చేరారు.
బీజేపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తన అనుచరులతో కలిసి బి.ఆర్.ఎస్. పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సభకు అధ్యక్షత వహించిన జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఒక్క ఆర్మూర్ నియోజకవర్గంలోనే 40వేల మంది రైతులకు రుణమాఫీ కాలేదని జీవన్ రెడ్డి గుర్తు చేశారు.రూ. 15వేల చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పి మాటతప్ప లేదా? అని ఆయన మండిపడ్డారు.
రైతుభరోసా కింద పెట్టుబడి సాయం అందక రైతుకు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసరా పెన్షన్లు పెంచి రూ.4వేల చొప్పున ఇస్తామన్న హామీ ఏమైందని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని బుట్ట దాఖలు చేశారని ఆయన విమర్శించారు. మహిళలకు రూ.2500 చొప్పున ఇస్తామన్న మహాలక్ష్మి పథకాన్ని తుంగలో తొక్కారన్నారు. విద్యార్థినులకు స్కూటీలు ఎప్పుడిస్తారని ఆయన ప్రస్తావించారు.
కళ్యాణ లక్ష్మి ద్వారా ఒక్కరికైనా తులం బంగారం ఇచ్చారా? అని ఆయన ధ్వజమెత్తారు. డమ్మీ సీఎం రేవంత్ పై ప్రజలకు నమ్మకం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పని కూడా చేయలేదని ఆయన విమర్శించారు. యథేచ్ఛగా ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాల జోరు సాగుతోందని ఆయన ఆరోపించారు.
కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, తాటికొండ రాజయ్య, బోధన్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆయేషా ఫాతిమా షకీల్, మాజీ జడ్పీ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు, బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్‌ఎంబి రాజేశ్వర్, తుల ఉమ, రాజారామ్ యాదవ్, అరవింద్, ఆర్.కె పురంకు చెందిన బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడ..
బాన్సువాడ ఆగస్టు 25 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా రైతుబంధు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు డాక్టర్ దుద్దాల అంజిరెడ్డి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. బీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని ఆయన స్పష్టం చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులపై చర్చించారు. మాజీ మంత్రితో పాటు పార్టీ సీనియర్ నాయకులు షేక్ జుబేర్, మోచి గణేష్, చందర్ తదితరులున్నారు.