calender_icon.png 2 September, 2025 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు

02-09-2025 12:01:37 AM

-దృఢమైన, నిర్ణయాత్మక విధానాలు అవలంబిద్దాం

-ద్వంద్వ ప్రమాణాలు పాటించవద్దు

ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలను దోషులుగా నిలబెట్టాలి..షాంఘై సహకార సంస్థ సదస్సులో భారత ప్రధాని మోదీ

బ్రిక్స్ దేశాల సామాజిక అభివృద్ధిని అడ్డుకుంటే ప్రతిఘటిస్తాం: రష్యా అధ్యక్షుడు పుతిన్

-షాంఘై సహకార సంస్థ  సదస్సులో ప్రధాని మోదీ

-భారత్, చైనా సరిహద్దుల్లో శాంతి నెలకొనాలి: చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్

-ఉగ్రవాదం, వేర్పాటువాదంపై ఉమ్మడి పోరాటానికి సభ్యదేశాల తీర్మానం

 బీజింగ్, సెప్టెంబర్ 1: ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం చేద్దామని, అందుకు షాం ఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సభ్యదేశాలన్నీ దృఢమైన, నిర్ణయాత్మక విధానాలు అవలంబించాలని భారత ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. చైనాలోని తియాంజిన్‌లో సోమవారం జరిగిన ఎస్‌సీఓ సదస్సులో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 22న భారత్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 22 మంది ప్రాణాలు కోల్పోయారని, ఉగ్రదాడిని ఖం డించి, భారత్‌కు సంఘీభావం తెలిపిన దేశాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలి పారు. సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడే దేశాల విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించకూడదని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలను దోషిగా నిలబెట్టాలని పిలుపునిచ్చారు.

ఉగ్రవాద నిర్మూలనకు పని చేయాలని ఆకాంక్షించారు. భారత్ అభివృద్ధి పథంలో ముం దుకు వెళ్తున్నదని, ఆ అభివృద్ధిలో ఎస్‌సీఓ సభ్య దేశాలు కూడా భాగస్వాములు కావాలని సూచించారు. సంస్కరణలు, పురోభి వృద్ధి, పరివర్తన అనే మూడు సూత్రాలతో భారత్ ముందుకు వెళ్తున్నదని పేర్కొన్నారు. భారత్ చైనా మున్ముందు వ్యూహాత్మక లక్ష్యాలతో ముందుకు వెళ్తాయని తెలిపారు. రెండు దేశాలు కలిసి చాబహర్ పోర్ట్, అంతర్జాతీయ ఉత్తర దక్షిణ ఆర్థిక కారిడార్ ప్రాజె క్ట్స్‌పై పనిచేస్తామని వెల్లడించారు.

ఆ ప్రాజెక్ట్‌లతో ఆసియాకు ఇతర దేశాలకు కనెక్టివిటీ పెరుగుతుందని ఆకాంక్షించారు. భారత్ ఆధ్వర్యంలో 2026లో జరిగే బ్రిక్స్ సదస్సుకు హాజరుకావాలని షీ జిన్‌పింగ్‌కు ఆహ్వానం పలికారు. బ్రిక్స్‌కు భారత్ సారథ్యం వహించేందుకు తాము మద్దతు ఇస్తామని ప్రకటించారు. అనంతరం చైనా, తుర్కియే సహా సభ్య దేశాలన్నీ పహల్గాంలో ఉగ్రదాడిని ఖండించాయి. మృతులు కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించాయి. తర్వాత సభ్యదేశాలన్నీ ఉగ్రవాదం, వేర్పాటువాదంపై ఉమ్మడి పోరాటం చేస్తామని తీర్మానం చేశాయి.

ఉక్రెయిన్ యుద్ధానికి మూలం పశ్చిమ దేశాలే: పుతిన్

ఉక్రెయిన్‌ను నాటో కూటమిలోకి లాక్కోవాలనే పశ్చిమదేశాలు ప్రయత్నిస్తున్నా య ని, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి అదే ప్రధాన కారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. షాంఘై సహకార సదస్సు (ఎస్‌సీఓ)లో ఆయన ప్రసం గిస్తూ..  యుద్ధం ప్రారంభం కావడానికి గల మూలాల్లోకి వెళ్లి పరిష్కారాలను కనుగొనాలని ఇతర దేశాధినేతలకు పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌కు పశ్చిమదేశాలు మద్దతు ఇవ్వడం వల్లే  యుద్ధం వచ్చిందన్నారు. ఏ దేశం కూ డా మరో దేశాన్ని బలి చేసి రక్షణ పొందలేదన్న సూత్రాన్ని తాము నమ్ముతామన్నారు. 2013 ఉక్రెయిన్ అప్పటి అధ్యక్షుడు విక్టర్ యనుకోవిను పడగొట్టిన తిరుగుబాటును ఆయన ఈ సందర్భంగా ప్రస్తావిం చారు.

ఈ సంఘటన తర్వాతే రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకుందని, తూర్పు ఉక్రెయిన్‌లో వేర్పాటువాదులకు మద్దతు ఇచ్చిందని పుతిన్ తెలిపారు. రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరాలంటే, రష్యాకు సంబంధించిన భద్రతాపరమైన అంశాలను పరిష్కరించాలని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల సామాజిక అభివృద్ధిని అడ్డుకునేందుకు వివక్షాపూరిత ఆంక్షలు విధిస్తే రష్యా, చైనా సమష్టిగా ప్రతిఘటిస్తాయని హె చ్చరించారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకుల వంటి సంస్థ లు చేపట్టే ఆర్థిక సంస్కరణలకు బ్రిక్స్ దేశాలు మద్దతునిస్తాయని స్పష్టం చేశారు. బ్రిక్స్ కూటమి దేశాలపై 10శాతం సుంకాలు విధిస్తామని ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో పుతిన్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

భారత్, చైనా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి నెలకొనాలి: షీ జిన్ పింగ్..

భారత్, చైనా సరిహద్దు ప్రాంతాల్లో శాం తి, సామరస్యత నెలకొనాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆకాంక్షించారు. ‘మనం శ త్రువులం కాదు. సహకార భాగస్వాములం. మనం ఒకరికొకరం ముప్పేమీ కాదు. పరస్పరం అభివృద్ధికి అవకాశాలు కల్పించుకునే వాళ్లం. ఇరుగు పొరుగు దేశాలుగా కలిసి ముందుకు సాగుతూ, సామరస్యపూర్వక సంబంధాలు కొనసాగించాలి. డ్రాగన్, ఏను గు కలిసి నాట్యం చేసేలా చూడాలి’ అని ఆకాంక్షించారు. ఇకపై కూడా సత్సంబంధాలు కొన సాగించాలని, అప్పుడే రెండు దేశాలు ప్రపం చ దేశాల్లో అగ్రగాములుగా నిలుస్తాయని పేర్కొన్నారు. అమెరికా ఏకపక్ష విధానాలను అవలంబిస్తున్నదని దుయ్యబట్టారు. ప్రపంచంలో పరిస్థితులు ఇంకా అస్థిరంగా ఉన్నా యని, ఇలాంటి సమయంలో బెదిరింపు ధోరణులను సహించకూడదని అమెరికాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. బయటివారి జోక్యాన్ని నివారించాలని పేర్కొన్నారు. ఆధిపత్య, దురంహకార విధానాలను తిప్పికొ ట్టాలని పిలుపునిచ్చారు. 

‘పహల్గాం’పై నెగ్గిన భారత్ పంతం

షాంఘై సహకార సదస్సు (ఎస్‌సీఓ)లో చైనా పహల్గాం ఉగ్రదాడిని ఖండించే విషయంలో భారత్ తన పంతాన్ని నెగ్గించుకు న్నది. ఉగ్రవాదం అంశంతో భారత్ రాజీలేని వైఖరి ఎట్టకేలకు ఎస్‌సీఓను ఏకతాటి పైకి తె చ్చి పహల్గాం దాడిని ఖండించేలా తీర్మా నం చేయించింది. దౌత్యపరంగా భారత్‌కు ఇది ఒక పెద్ద విజయమని చెప్పవచ్చు. ఇదే ఎస్‌సీఓకు సంబంధించిన రక్షణ మంత్రుల సద స్సు గతంలో చైనాలోని ప్రధాన నగరమైన క్వింగ్డావోలో జరిగింది. నాడు పహ ల్గాం ఉగ్రదాడి ఘటనను దాటవేస్తూ చైనా చేసిన ప్రకటనపై భారత్ నిరసన వ్యక్తం చేసింది. అంతేకాదు పాక్‌కు అనుకూలంగా చైనా బలోచిస్థాన్ అంశాన్ని డిక్లరేషన్‌లో చేర్చడం గమనార్హం. ప్రస్తుతం ఎస్‌సీఓకు అధ్యక్షత వహిస్తున్న చైనాతో నాడు పాకిస్థాన్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. క్విం గ్డావో సద ్స ప్రకటనలో పహల్గాం ఉగ్రదాడిని చేర్చేందుకు నాడు చైనా నిరాకరించింది. దీం తో భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నాడు చైనా పెద్దల ముందే పాకిస్థాన్‌కు చురకలు అంటించారు. 

ఒకే కారులో మోదీ, పుతిన్ ప్రయాణం..

భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒకే కారులో సుమారు 45 నిమిషాలు  ప్రయాణిస్తూ షాంఘై సహకార సద స్సు (ఎస్‌సీఓ) వేదిక వద్దకు బయల్దేరారు. మార్గమ ధ్యంలో అనేక అంశాలపై ముచ్చటించుకున్నారు. వేదిక వద్ద చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ వారికి స్వయంగా స్వాగతం పలికారు. అనంతరం ముగ్గురు దేశాధినేతలు కాసేపు ముచ్చటించారు. ఆ వీడియోను రష్యన్ విదేశాంగశాఖ ‘వీడియో ఆఫ్ ది డే’ అని పేర్కొంటూ సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అయింది.

యుద్ధం ముగియాలి

రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొనాలి భారత్ రష్యా ద్వైపాక్షిక సదస్సులో భారత ప్రధాని మోదీ రెండు దేశాల మధ్య బంధం బలోపేతం: పుతిన్

రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగియాలని, ప్రపంచ మానవాళి కోరుకుం టున్నదని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇరు దేశాల ఆ దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొ న్నారు. చైనాలోని తింజాయన్ నగరంలో సోమవారం రష్యా భారత్ మధ్య జరిగిన ద్వైపాక్షిక సదస్సులో మోదీ మాట్లాడారు. ఎప్పుడు కష్టకాలం ఎదురైనా మాస్కో  ఢిల్లీ ఒకరికొకరు వెన్నుదన్నుగా నిలిచాయని పేర్కొన్నారు.

డిసెంబర్‌లో భారత్‌లో జరుగనున్న భారత్ రష్యా సదస్సుకు విచ్చేసే రష్యా అధ్యక్షుడు పుతిన్ కోసం 140 కోట్ల మంది భారతీయులు ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య జరుగుతున్న భేటీలు ప్రత్యేక బంధానికి నిదర్శనమని అభివర్ణించారు. మున్ముందు రెండు దేశాలు మల్టిపుల్ సహకారంతో ముందుకు వెళ్తాయని పేర్కొన్నారు. అనంతరం రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ.. భారత ప్రధాని మోదీ తన ఆప్తమిత్రుడని పేర్కొన్నారు. ఎస్‌సీవో వేదిక గ్లోబల్ సౌత్, ఈస్ట్ దేశాలకు మంచి వేదిక అని కొనియాడారు. డిసెంబర్‌లో జరుగనున్న  ద్వైపాక్షిక సదస్సు రెండు దేశాల మధ్య బంధాన్ని మరింత బలపరుస్తుందని ఆకాంక్షించారు.

పాకిస్థాన్ ప్రధానికి చేదు అనుభవం..

సదస్సులో భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ముచ్చటిస్తుండగా, వెనుక పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ నిలబడి ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. మోదీ, పుతిన్ మాట్లాడుకుంటూ, పాక్ ప్రధానిని గమనించకుండానే ఆయన ముందు నుంచే వెళ్లిపోయారు. దీంతో పాక్ ప్రధాని అచేతనంగా నించుని ఉండిపోయారు. భారత్, రష్యా అధినేతల కదలికలను ఎస్‌సీఓ సమావేశానికి విచ్చేసిన పెద్దలు ఆసక్తికరంగా గమనిస్తూ ఉన్నారు.