calender_icon.png 11 September, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టుల సొంతింటి కల కోసం పోరాటం

11-09-2025 01:29:15 AM

నిజాంపేటలో హసన్ షరీఫ్ నిరాహార దీక్ష

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): పేద జర్నలిస్టుల సొంతింటి కలను నెరవేర్చాలనే డిమాండ్‌తో జర్నలిస్ట్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సభ్యుడు హసన్ షరీఫ్ చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండో రోజుకు చేరింది. రెండు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న తమ గృహ సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, సానుకూల పరిష్కారం సాధించాలనే లక్ష్యంతో ఆయన ఈ దీక్షకు పూనుకున్నారు.

రెండో రోజూ కొనసాగిన దీక్ష...

హైదరాబాద్‌లోని నిజాంపేటలో ఏర్పా టు చేసిన దీక్షా శిబిరంలో హసన్ షరీఫ్ తన నిరసనను కొనసాగిస్తున్నారు. తొలిరోజు దీక్షలో మారేపల్లి లక్ష్మణ్ నేత, మంజుల రెడ్డి, భరద్వాజ్, ఆర్టిస్ట్ వాసు శ్రీనివాసరావు పాల్గొని ఆయనకు సంఘీభావం తెలిపారు. మంగళవారం రెండో రోజు నిర్మలా రెడ్డి, భవాని, ఇంద్రవెళ్లి రమేష్లు రిలే దీక్షలో కూర్చుని హసన్ షరీఫ్కు మద్దతు పలికారు.

ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లడమే లక్ష్యం...

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, 20 ఏళ్లుగా జర్నలిస్టుల గృహ సమస్య అపరిష్కృతంగానే ఉందని, ఎన్నో ప్రభుత్వాలు మారినా తమ గోడును ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం వెంటనే స్పందించి, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. హసన్ షరీఫ్ చేపట్టిన ఈ పోరాట స్ఫూర్తితో జర్నలిస్టులందరూ ఏకతాటిపైకి వచ్చి, తమ సమస్య తీవ్రతను ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లాలని సొసైటీ సభ్యులు పిలుపునిచ్చారు.