07-11-2025 12:17:10 AM
ఖైరతాబాద్, నవంబర్ 6 (విజయ క్రాంతి) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ గెలిస్తేనే నియోజకవర్గం అభివృద్ధి చెందు తుందని, అందుకే తమ పార్టీ అభ్యర్థి లంకల్ దీపక్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కోరారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాలనలో హైదరాబాద్ నగర అభివృద్ధి కుంటుపడిపోయిందని, గ్రామస్థాయిలో జరిగిన అభివృద్ధి కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరగలేదని ఆయన విమర్శించారు.
గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కేంద్ర మంత్రి మీట్ ద ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ ఇప్పటివరకు గెలవలేదని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో బీజేపీ తక్కువ ఓట్లతో ఓడిపోయిందని, తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని తెలిపారు. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గం దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగినదని చెప్పారు.
గత బీఆర్‌ఎస్ పాలనలో ఎన్నో కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టామని చెబుతోందన్నారు. కానీ తాము బస్తీలలో ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు డ్రైనే జీ ఓవర్ ఫ్లో, దయనీయమైన రోడ్లు, పరిశుభ్రం లేని తాగునీరు, నెలల తరబడి వీధిలై ట్లు పనిచేయకపోవడం వంటి అనేక సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రత్యేకంగా బోరబండ, రహమత్ నగర్, ఎర్రగడ్డ, యూసఫ్‌గూడ, షేక్‌పేట వంటి ప్రాంతాల్లో గ్రామస్థాయి అభివృద్ధి కూడా జరగలేదని విమర్శించారు.
గతంలో జీహెచ్‌ఎంసీ వద్ద డబ్బులు డిపాజిట్లుగా ఉండేవని, కానీ ప్రస్తు తం వీధిలైట్లు వేయడానికి కూడా డబ్బు లేని పరిస్థితి నెలకొందని దుయ్యబట్టారు. రాష్ట్రం మొత్తానికి అత్యధిక రెవెన్యూ హైదరాబాద్ నుంచే వస్తోందని, అలాంటి నగరంలో ప్రధాన సంస్థలైన జీహెచ్‌ఎంసీ, వాటర్ బోర్డు ఆర్థికంగా కృంగిపోయాయని విమర్శించారు. దీంతో హైదరాబాద్ అభివృద్ధి కుంటిబడిపోయిందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి గురించి మాట్లాడడం లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ డిసెం బర్ 24 లోపు అన్ని గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి పత్రికల్లో పెద్దపెద్ద ప్రకటనలు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ భర్తీచేస్తామన్న రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇక్కడ ఎక్కడ మాయమయ్యాయో ఎవరికీ తెలువదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పొదు పు సంఘాల కోసం బ్యాంకుల ద్వారా రూ. 20 లక్షల వరకు రుణాలను అందిస్తుందని తెలిపారు.
దేశవ్యాప్తంగా ఉన్న ప్రధానమంత్రి ఉచిత ధాన్య పథకం కింద 83 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. కరోనా సంక్షోభం నుంచి సుమారు 80 కోట్ల మంది పేద ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ఉచిత బియ్యం పంపిణీ చేశారని తెలిపారు. కావున జూబ్లీహిల్స్ నియోజ కవర్గం అభివృద్ధికి ఓటర్లు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలని కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై వివిధ సంస్థలు చేస్తున్న సర్వేలు నమ్మేలా లేవని తెలిపారు.