05-08-2025 12:00:00 AM
నారాయణపేట్ జిల్లా మక్తల్ మండలంలోని భూత్పూర్ గ్రామస్తులు 15 సంవత్సరాలుగా ఎత్తిపోతల పథక ప్యాకేజీ- కోసం ఎదురుచూస్తున్నారు. అప్పటి ఉమ్మడి ప్రభుత్వం 2010లో భూత్పూర్‌ను ముంపు గ్రామంగా ప్రకటించింది. జీవో నెంబర్ 122/210 విడుదల చేసింది. ప్రభుత్వం ఇప్పటివరకు నిర్వాసితులకు మాత్రం పరిహారం అందలేదు. గ్రామంలో 983 కుటుంబాలున్నాయి. మొత్తం 18,067 మంది జనాభా ఉన్నారు. గ్రామానికి ఒకవైపు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, రెండు వైపులా ఊర చెరువులు, మూడో వైపు కల్యాల చెరువు, మరోవైపు కుడి కాల్వ ఉంది. ఏటా ఈ ప్రాంతంలో వర్షాకాలంలో నీటి ఊట ఉబికి వస్తున్నది. సమస్యతో తాము 15 ఏళ్ల నుంచి ఇబ్బంది పడుతున్నా, ప్రభుత్వం స్పందించడం లేదని గ్రామస్తులు చెప్తున్నారు.
ఏడాదిలో నాలుగు నెలల పాటు తీవ్రమైన కష్టాలు పడుతున్నామని, గ్రామంలో ఎవరైనా చనిపోతే ఖననం చేసేందుకు కూడా వీలు లేదని వాపోతున్నారు. గతంలో అధికారులు 2015లో గ్రామ పునరావాసం కోసం బీరప్ప గుడి వద్ద వంద ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. కానీ ఇప్పటి వరకు అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించలేదు. గ్రామంలో ఎన్ని ఇళ్లు ఉన్నాయి.. ఎంత పరిహారం ఇవ్వాలి తదితర అంశాల గుర్తింపునకు సామాజిక సర్వే కూడా పూర్తి చేయలేదు. అసలు పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తారా? లేదా? అని గ్రామస్థులు ఇప్పుడు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని తక్షణం పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలని బాధితులు కోరుతున్నారు.
సురేశ్, భూత్పూర్
ఎల్‌ఎండీ సమస్యలను పరిష్కరించాలి..
కరీంనగర్ శివారులోని మానేరు జలాశయం (ఎల్‌ఎండీ) కట్టకు ఇరువైపులా ముళ్లపొదలు పెరిగిపోయాయి. ముళ్ల పొదలు, తుమ్మ చెట్లతో అస్తవ్యస్తంగా మారింది. కట్టపై కుక్కల బెడద కూడా వాకర్స్‌ను, సందర్శకులను ఇబ్బంది పెడుతున్నది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కట్టపై వాకింక్ చేసేందుకు వందలాది మంది వాకర్స్ వస్తుంటారు. వారందరూ అసౌకర్యానికి గురవుతున్నారు. జలాశయం బాగోగులను చూసుకోవాల్సిన ఎస్సార్ ఎస్పీ అధికారులు సమస్యలను పట్టించుకోవడం లేదు. లష్కర్లు చెట్లను తొలగించడం లేదు. కట్టపై విద్యుత్ దీపాలు కూడా సరిగా వెలగడం లేదు. ఇప్పటికైనా అధికారులు సమస్యలను పరిష్కరించాలి.
శేఖర్, కరీంనగర్