calender_icon.png 9 August, 2025 | 7:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్రవాదుల ఏరివేత

05-08-2025 12:00:00 AM

జమ్మూకశ్మీర్‌లోని బైసరన్ లోయలో పర్యాటక ప్రాంతమైన పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి భారత్‌ను ఉలిక్కిపడేలా చేసింది. 26 మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్న ముష్కరులను మట్టుబెట్టడమే లక్ష్యంగా భారత సైన్యం బరిలోకి దిగింది. ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న ‘ఆపరేషన్ సిందూర్’తో దీటుగా బదులిచ్చింది. పీవోకేలోని ఉగ్ర స్థావరాలు, పాకిస్థాన్ సైనిక స్థావరాలే కేంద్రంగా భారత్ భారీ దాడులు చేసి వంద మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చింది.

భారత సైన్యం అంతటితో ఆగిపోలేదు. జమ్మూకశ్మీర్‌ను ఉగ్రరహిత రాష్ట్రంగా మార్చడమే ధ్యేయంగా ముందుకు వెళ్లింది. స్థానిక జమ్మూకశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాల సహకారంతో ఉగ్రవాద ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను అడ్డుకునేందుకు అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నది. తద్వారా ఉగ్రవాదులను ఏరివేస్తున్నది. భారత సైన్యం వరుస ఆపరేషన్లతో ఉగ్రవాదులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. పహల్గాం దాడి జరిగిన 100 రోజుల్లో 12 మంది ఉగ్రవాదులను హతమార్చింది. ‘ఆపరేషన్ మహాదేవ్’, ‘ఆపరేషన్ శివశకి’్త, ‘ఆపరేషన్ అఖాల్’.. ఇలా పేరేదైనా ఆపరేషన్లు ఇంకా కొనసాగుతున్నాయి. ‘ఆపరేషన్ మహాదేవ్’ పహల్గాం ఉగ్రదాడికి భారత్ తీర్చకున్న ప్రతీకారంగా నిలిచింది.

ఈ ఆపరేషన్‌లో పహల్గాం ఉగ్ర దాడి వెనుక కీలక సూత్రధారి సులేమాన్ షా సహా అబు హమ్జా, యాసిర్ హతమయ్యారు. హర్వాన్  ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు నిఘా వర్గాల సమాచారంతో నెల రోజులుగా సైన్యం, పోలీసు బలగాలు గాలింపు కొనసాగించాయి. ఆపరేషన్ కోసం గత కొన్ని రోజులుగా దళాలు పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేశాయి. వారి కదలికలను కనిపెట్టేందుకు రెండు రోజుల క్రితం శాటిలైట్ కమ్యూనికేషన్ తిరిగి యాక్టివేట్ చేశారు.

స్థానిక సంచార జాతుల సైతం ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందించడంతో దాచీగామ్ అడవులను తమ ఆధీనంలోకి తీసుకుని ముమ్మర కూంబింగ్ నిర్వహించి ముగ్గురిని మట్టుబెట్టారు. హతమైన ముష్కరులు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్), లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలకు చెందిన వారని అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద ‘ఆపరేషన్ శివశక్తి పేరిట’ భారత సైన్యం, కశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు కలిసి ఆపరేషన్ నిర్వహించాయి. ఆపరేషన్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. 

దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని దట్టమైన అఖాల్ అడవుల్లో ఉగ్రవాదులు నక్కి వున్నారన్న విషయం తెలుసుకున్న భారత ఆర్మీ, పోలీసు బృందాలు, భద్రతా బలగాలు ‘ఆపరేషన్ అఖాల్’ పేరిట కూంబింగ్ చేపట్టాయి. కచ్చితమైన సమాచారంతో రీ కార్టన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఆపరేషన్‌లో ఇప్పటివరకు ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ‘ఆపరేషన్ అఖాల్’లో భాగంగా ఉగ్రవాదుల వేట కొనసాగుతూనే వుంది. ఆపరేషన్‌ను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, 15 కార్ప్స్ కమాండర్ సహా ఉన్నత భద్రతా అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.

అఖాల్ ప్రాంతంలో దాక్కున్నట్టు భావిస్తున్న టీఆర్‌ఎఫ్ (ది రెసిస్టెన్స్ ఫ్రంట్) ఉగ్రవాదులను దేశం నుంచి తరిమికొట్టడమే లక్ష్యంగా నిఘా సాధనాలు, కచ్చితత్వ వ్యూహాలు అమలవుతున్నాయి. మొత్తానికి పహల్గాం ఉగ్రదాడితో జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాద భయాలు నెలకొన్నాయి. ఏ వైపు నుంచి వచ్చి ఉగ్రదాడులు జరుగుతాయోనని స్థానికులు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. స్థానికుల్లో ఉగ్రవాద భయాన్ని పోగొట్టాలని భావించిన కేంద్రం.. ఆర్మీ, పోలీసులు, భద్రతా బలాగాలతో జమ్మూ కశ్మీర్‌లో సంయుక్త ఆపరేషన్లు నిర్వహిస్తున్నది. తద్వారా ఉగ్రవాదులను మట్టుబెడుతూ స్థానికుల్లో భరోసానిస్తున్నది. ఈ ప్రయత్నంతో కశ్మీర్‌వాసుల్లో ఉగ్రవాద భయం తొలిగి, జనజీవనం సాధారణ స్థాయికి వస్తుందని భారత ప్రభుత్వ కోరుకుంటున్నది.