calender_icon.png 13 August, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లాభాల వాటా ఆలస్యంపై గుర్తింపు సంఘం వైఖరి స్పష్టం చేయాలి

10-08-2025 05:38:58 PM

సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్

మందమర్రి,(విజయక్రాంతి): సింగరేణిలో ఆర్థిక సంవత్సరం ముగిసి 5 నెలలు గడుస్తున్న ప్పటికీ సంస్థ సాధించిన లాభాలపై యాజమాన్యం ప్రకటన చేయడం లేదని లాభాల వాట ప్రకటనపై గుర్తింపు సంఘం తన వైఖరిని స్పష్టం చేయాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు సాంబారు వెంకటస్వామి అల్లి రాజేందర్ లు డిమాండ్ చేశారు. పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు.  లాభాల వాటాను గతంలో జూలైలో ఇప్పించామని గొప్పలు చెప్పే గుర్తింపు సంఘం నాయకులు  ఆగస్టు వచ్చిన లాభాలు ప్రకటించకుండా యాజ మాన్యంపై ఒత్తిడి తేకుండా మిన్నకుండడం వెనక ఆంతర్యమేమిటో స్పష్టం చేయాలన్నారు.

గత సంవత్సరం లాభాలు ప్రకటించిన తీరుపై కార్మికులు  గుర్రుగా ఉన్నారని, ఈసారి అలాంటి పొరపాట్లు జరగ కుండా చూడాలని, గుర్తింపు  సంఘం గని స్థాయినాయకులు కార్మికులకు ఏమి చెప్పాలో తెలియక సతమవుతున్నారని దీనిని గుర్తింపు సంఘం నాయకులు గ్రహించాలన్నారు. ఇటీవల గుర్తింపు సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యాజమాన్యాన్ని కలిసి స్ట్రక్చర్ సమావేశాలపై సర్కులర్లు ఇవ్వమని  అడిగామంటున్నారే తప్ప లాభాలపై యాజమాన్యoతో ఎందుకు  మాట్లాడటం లేదని వారు ప్రశ్నించారు. ప్రతిపక్షాలుగా సేఫ్టీ కమిటీలపై ప్రశ్నిస్తే యువతకు ప్రాధాన్యం ఇవ్వద్దంటున్నారంటూ తప్పుడు మాటలు మాట్లాడే  నాయకులు స్ట్రక్చర్ సమావేశాల్లో ఎందుకు యువతకు ప్రాధాన్యత కల్పించలేక పోయారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

సేఫ్టీ కమిటీలలో అనుభవజ్ఞులు ఉన్నప్పుడే వారి అనుభవంతో ప్రమాదాలు జరగకుండా యాజమాన్యానికి సూచనలు ఇచ్చే అవకాశం ఉన్నదన్న సంగతి గుర్తింపు సంఘం నాయకులు తెలుసు కోవాలన్నారు. గతంలో గుడి పేరు మీద చందాలు రికవరీ చేసుకున్న చరిత్ర మీకు ఉన్నదనీ, మమ్మల్ని కార్మికులు స్వచ్ఛందంగా ఆదరిస్తారని, ఏరియాలో సిఐటియు ఎదుగుదలను ఓర్వలేని నాయకులు తమ వెనుక ఏమి మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలని హితవు పలికారు. ప్రతిపక్షాలుగా గుర్తింపు సంఘం ఇచ్చిన ఎన్నికల హామీలను ఎప్పటి కప్పుడు గుర్తు చేస్తూ ఒత్తిడి తెస్తామని అందులో భాగంగా నే ఇటీవల కమిటీల పై ఒత్తిడి చేస్తే తప్పని పరిస్థితుల్లో యాజమాన్యాన్ని మీరు అడిగిన సంగతి గుర్తుంచు కోవాలన్నారు.

గుర్తింపు సంఘంగా గెలిచి 18 నెలలు గడిచినప్పటికి మేనిఫెస్టో హామీలు అమలు చేయలేక పోతున్నారని వారు మండి పడ్డారు. బాట బూట్లు   నాణ్యమైన రక్షణ పరికరాలు కావాలని అడుగుతున్నామని చెబుతున్న గుర్తింపు సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఇంకెంతకాలం మాటలతో గడుపుతారని వారు ప్రశ్నించారు. వామపక్ష యూనియన్ గా కార్మిక సమస్యలపై నిక్కచ్చిగా యాజమాన్యంతో పోరాడాలని ఓడిన సంఘాలను విమర్శించడం కాదన్న సంగతి గుర్తెరగాలని వారు సూచించారు. యూనియన్ ఉపాధ్యక్షులు వడ్లకొండ ఐలయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు వడ్లకొండ ఐలయ్య, అలవాల సంజీవ్, జోరుక వెంకటేష్, జడల ప్రవీణ్, ఆగిడి రాజ్ కుమార్, నాగవెల్లి శ్రీధర్, ధనిశెట్టి సురేష్, బద్రి ఆదర్శ్, లింగాల రమేష్, ఎండి తాజుద్దీన్, నాగరాజు లు పాల్గొన్నారు.