12-07-2025 07:57:23 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): 317 జీవో వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులకు ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని టిపియూఎస్ సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) మానుకోట జిల్లా ఉపాధ్యాయుల అభ్యాస వర్గ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు జంజిరాల నాగరాజు, ప్రధాన కార్యదర్శి గుడిబోయిన గోపికృష్ణ ఆధ్వర్యంలో కేసముద్రం పట్టణంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ, ఉపాధ్యాయుల పాత్ర అనే అంశంపై రాష్ట్ర అధ్యక్షుడు కానుగంటి హనుమంతరావు ప్రసంగించారు.
కార్యకర్త సంఘ సిద్ధాంతం అంశంపై ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహ పింగిలి శ్రీనివాస్ ప్రసంగించారు. సర్వీస్ రూల్స్ అంశంపై విశ్రాంత ఉపాధ్యాయులు రావుల యాదగిరి ప్రసంగించారు. తపస్ చరిత్ర గురించి రాగి సోమనసయ్య చారి వివరించారు. ఈ సందర్భంగా హాజరైన తపస్ రాష్ట్ర అధ్యక్షులు కానుగంటి హనుమంతరావు మాట్లాడుతూ... ప్రభుత్వ రాష్ట్ర ఉద్యోగులకు హామీ ఇచ్చిన 317 బాధితులకు వెంటనే న్యాయం చేయాలని, పెండింగ్ బిల్లులను సత్వరమే నిధులు విడుదల చేయాలని, వెంటనే పిఆర్సిని అమలు చేయాలని డిమాండ్ చేశారు.