13-05-2025 12:00:00 AM
కాళేశ్వరం, మే 12 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, త్రివేణి సంఘమంగా విలసిల్లుతున్న కాళేశ్వరంలో ఈనెల 15న సరస్వతి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. దేశంలో ఎక్కడ లేని విధంగా ఒకే పానవట్టంపై (కాళేశ్వర, ముక్తేశ్వర స్వామి) రెండు శివలింగాలు కలిగివున్న ఏకైక పుణ్యక్షేత్రం కాళేశ్వరం. ఈ రెండు లింగాలకు నిత్యం అభిషేకించిన నీరు గోదావరి ప్రాణహిత నదుల సంఘమ స్థానంలో కలుస్తుండడంతో ఇక్కడ సరస్వతీ నదిని అంతర్వాహినిగా పిలుస్తుంటారు. ప్రస్తుతం సరస్వతీ పుష్కరాలను దేశంలో నాలుగు చోట్ల నిర్వహిస్తున్నారు.
అందులో ఉత్తరాదిలో నాలుగు ప్రాంతాలు ఉండగా దక్షిణాదిలో ఒక్క కాళేశ్వరంలో నిర్వహిస్తుండడం విశేషం. ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ ఉత్తరప్రదేశ్ లోని గంగా, యమునా, సరస్వతి నదుల సంగమ స్థానంగా భావించే ప్రయాగ్రాజ్, గుజరాత్ లోని సోమనాథ్, రాజస్థాన్ లోని పుష్కర్ లో ఈనెల 15న మహా క్రతువు ప్రారంభం కానుంది.
దక్షిణాదిన కాళేశ్వరంలో నిర్వహిస్తున్న పుష్కరాలకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. పుష్కరాల కోసం ప్రభుత్వం 35 కోట్ల రూపాయలతో అధునాతన, శాశ్వత ప్రాతిపదికన పనులు నిర్వహిస్తోంది. పుష్కరాలను పురస్కరించుకొని కాళేశ్వరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకునే విధంగా ముస్తాబవుతోంది.
కోటి రూపాయల వ్యయంతో 24 టన్నుల బరువు 10 అడుగుల ఎత్తు ఉన్న చదువుల తల్లి సరస్వతీ దేవి విగ్రహాన్ని తమిళనాడులో తయారు చేయించి తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్టించారు. అలాగే మహాబలిపురం నుంచి ప్రత్యేకంగా రూపొందించి తెచ్చిన ‘జ్ఞాన దీపం’, రెండు హస్తాల మధ్య తాళపత్రాలు పొందుపరిచి పై భాగంలో దీపం కాంతి చిత్రాలతో ప్రత్యేకంగా రూపొందించిన ఆకృతి ఆకట్టుకుంటోంది.
భక్తులు సరస్వతీ పుష్కరాల సందర్భంగా గోదావరి నదిలో పుష్కర స్నానం ఆచరించేందుకు అణువుగా 86 మీటర్ల మేర చేపట్టిన జ్ఞాన సరస్వతి ఘాట్ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. భక్తులు ఘాట్ల వద్దకు వెళ్లేందుకు వీలుగా రహదారులు ఏర్పాటు చేశారు. త్రివేణి సంగమంలో ఎగుడు దిగుడుగా ఉన్న ఇసుక మేటలను సరి చేయడం వల్ల యాత్రికలకు ఇబ్బంది లేకుండా పోయింది.
సరస్వతీ పుష్కరాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 15న వస్తున్న నేపథ్యంలో తీరానికి సమీపంలో హెలిప్యాడ్ నిర్మాణం చేపట్టారు. అలాగే జ్ఞాన సరస్వతి ఘాటు వద్ద ప్రత్యేకంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో 30 కాటేజీలతో టెన్ట్ సిటీ ఏర్పాటు చేశారు. ఆధునిక వసతులతో కూడిన టెన్ట్ సిటీలో విశ్రాంతి తీసుకోవాలంటే రోజుకు మూడు వేల రూపాయలు ధర నిర్ణయించారు.
పుష్కరాలకు ఏడుగురు పీఠాధిపతుల్లో రోజుకొకరు రానుండగా వారికి ప్రత్యేక విడిదిని ఏర్పాటు చేశారు. త్రివేణి అతిథి గృహాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈనెల 15న ఉదయం 5:44 గంటలకు విశేష పూజతో ప్రారంభించనున్నారు. ఈనెల 15 నుండి 26 వరకు జరిగే సరస్వతీ పుష్కరాలకు ప్రతిరోజు లక్షన్నర మంది భక్తులు వస్తారని అంచనా.
అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తులకు పుష్కరాలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా సరస్వతీ పుష్కరాలు 2025 పేరిట ప్రత్యేక యాప్ రూపొందించింది. ప్రతిరోజు ఒక మంత్రి, ఐదుగురు ఎమ్మెల్యేలు కాళేశ్వరాన్ని సందర్శించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.