09-09-2025 07:48:30 PM
కలెక్టర్ బి.యం.సంతోష్..
గద్వాల (విజయక్రాంతి): కాలాన్ని ఆయుధంగా మార్చుకుని తన కవిత్వం, రచనల ద్వారా ప్రజలకు చైతన్యం కల్పించిన మహనీయుడు ప్రజా కవి కాళోజీ నారాయణ రావు అని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్(District Collector B.M. Santosh) అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రజా కవి,పద్మ విభూషణ్ స్వర్గీయ కాళోజీ నారాయణ రావు 111వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సమ సమాజ నిర్మాణానికి కాళోజీ బాటలు వేసారని,ఆయన జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమం ఊపిరిగా జీవించిన ప్రజా కవి, తెలుగు భాష, ప్రజల అవసరాల కోసం కాళోజీ నిరంతరం కృషి చేశారని, తన కవితలు ,రచనల ద్వారా ప్రజల్లో స్పూర్తి నింపారని గుర్తుచేశారు. “పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది” అని నినదించిన కాళోజీ జీవితం మొత్తం తెలంగాణ భాషా, సాహిత్య సేవకు అంకితం చేయడమే కాకుండా, వివక్ష ఎక్కడ ఉన్నా వ్యతిరేకరించి, అణచివేత అన్యాయాలపై ధిక్కారస్వరం వినిపించారని తెలిపారు. ఆయన చూపిన మార్గాన్ని అనుసరించి ప్రజలకు సేవ చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు లక్ష్మి నారాయణ,నర్సింగా రావు,ఎ.ఓ భూపాల్ రెడ్డి,బీసీ సంక్షేమ శాఖ అధికారి అక్బర్ పాషా,వివిధ శాఖల జిల్లా అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.