calender_icon.png 15 August, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జలదిగ్బంధంలో కల్వకుర్తి పట్టణ కాలనీలు

15-08-2025 12:27:11 AM

  1. వర్షం పడితే  గుండె చెరువు 
  2. డ్రైనేజీ లేకపోవడమే ప్రధాన కారణం
  3. కాసుల కక్కుర్తిలో అడ్డగోలు అక్రమ అనుమతులు
  4. ప్రమాదం అంచున పసిపిల్లల ప్రాణాలు
  5. తాత్కాలిక మరమ్మతులతో సరిపెడుతున్న వైనం

కల్వకుర్తి, ఆగస్టు 14: వర్షాకాలం ముందుగానే వరదల ప్రభావాన్ని అంచనా వేసి, సమస్యలను నివారించే ముందస్తు చర్యలు చేపట్టడం మున్సిపల్ అధికారుల కర్తవ్యమే. కానీ కల్వకుర్తి మున్సిపల్ అధికారులు మాత్రం అలసత్వం ప్రదర్శిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షానికే పట్టణంలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుపోవడం వారి నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది.

ప్రతీ వర్షాకాలంలోనూ కాలనీలు నీటమునిగిపోతున్నా అధికారులు తాత్కాలిక మరమ్మతులతోనే సమస్యను నెట్టిపెడుతున్న పరిస్థితి. శాశ్వత పరిష్కారంపై చిత్తశుద్ధి లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  విద్యానగర్, భగత్ సింగ్ నగర్, రాఘవేంద్ర కాలనీలలో డ్రైనేజీ వ్యవస్థ అసలు లేకపోవడంతో చిన్నపాటి వర్షానికి కుంటలను తలపిస్తోంది. బచ్పన్ స్కూల్ పరిసర ప్రాంతం మొత్తం చిన్నపాటి వర్షానికే చెరువుగా మారిపోతోంది.

కాసుల కక్కుర్తిలో పడి మున్సిపల్ అధికారులు అడ్డగోలుగా అక్రమ అనుమతులు జారీ చేస్తే, పాఠశాల యాజమాన్యం రక్షణ చర్యలు లేకుండా పసిపిల్లల ప్రాణాలు గాల్లో దీపంగా మారింది.  పన్నులు వసూలు చేయడంలో చూపే శ్రద్ద పారిశుద్ధ్య పనులపైనా చూపాలని సామాన్యులు డిమాండ్ చేస్తున్నారు. పట్టణంలో ప్రతి మూలలో మురుగు నీరు, చెత్త, దుర్వాసనతో ప్రజల జీవన ప్రమాణాలు రోజురోజుకీ క్షీణిస్తున్నా మున్సిపల్ అధికారులకు మాత్రం లాభదాయక అనుమతులు, కాంట్రాక్టులు, ఫోటో సెషన్లకే ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

రాఘవేంద్ర కాలనీలో సమస్య తీవ్రతను ఎన్నిసార్లు విన్నవించుకున్నప్పటికి ప్రజల అనుమతులన్నీ చెత్త బుట్టకే పరిమితమై డ్రైనేజీ సమస్య తీరడం లేదు. కమిషనర్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అందుబాటులో ఉండరనీ, ఆఫీసు కి వెళ్తే అక్కడా నిరాశే, ఫీల్ విసిట్, ఉన్నతాధికారుల మీటింగ్ అంటూ సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

పట్టణంలోని కాలనీలోనే కాకుండా పట్టణం నడిబొడ్డున ఉన్న బస్టాండ్ ప్రాంతమంతా చిత్తడితో కూడిన దుర్వాసన వెదజల్లుతు ఉండడంతో ప్రజలు ముక్కు మూసుకొని రాకపోకలు కొనసాగిస్తున్నారు. పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని ప్రాణాల్ని దృష్టిలో పెట్టుకొని బాధ్యత గల సంబంధిత అధికారులు స్పందించి పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.