03-05-2025 11:04:12 PM
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు...
బూర్గంపాడు (విజయక్రాంతి): పేదింటి ఆడపడుచులకు కల్యాణ లక్ష్మీ పథకం వరమని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateswarlu) అన్నారు. మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మొత్తం105 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ సబ్బండ వర్గాల ప్రజలకు అండగా నిలుస్తోందన్నారు. పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం ఆర్థికంగా ఎంతో తోడ్పాటును అందిస్తుందని తెలిపారు. మహిళల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామంటూ ఎవరైనా ప్రజలను మోసం చేస్తే ఊరుకునేది లేదన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు. గత ప్రభుత్వాలలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ హయాంలో అవకతవకలకు తావు లేదన్నారు.అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు.
పేదలను మోసం చేసేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజాప్రభుత్వంలో ఎవరీకీ అన్యాయం జరగనివ్వబోమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏడిఎ తాతారావు, తహశీల్దార్ ముజాహిద్, ఎంపీడీఓ జమలారెడ్డి, ఆర్ఐ నరసింహారావు, బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుగ్గంపూడి కృష్ణారెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్లు పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, కైపు లక్ష్మీనారాయణ రెడ్డి, భజన ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళ నాయకులు, యువజన తదితరులు పాల్గొన్నారు.