10-12-2025 02:00:47 AM
లంకతో సిరీస్‌కు మహిళల జట్టు ప్రకటన
ముంబై, డిసెంబర్ 9 : స్వదేశంలో శ్రీలంక తో జరిగే ఐదు టీ ట్వంటీల సిరీస్ కోసం భార త మహిళల జట్టును ప్రకటించారు. యువ వికెట్ కీపర్ బ్యాటర్ జి కమలిని, 19 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ వైష్ణవి శర్మ తొలిసారి చోటు దక్కించుకున్నారు. అండర్ 19 టీ20 ప్రపంచకప్ ఆడిన వీరిద్దరూ అద్భుతంగా రాణించడం తో సెలక్టర్ల పిలుపు దక్కింది. ముంబై ఇండియన్స్ తరపున డబ్ల్యూపీఎల్‌లో అరంగేట్రం చేసిన కమలిన తన కీపింగ్‌తో ఆకట్టుకుంది.
అలాగే సీనియర్ మహిళల టీ20 ట్రోఫీలో అదరగొట్టిన వైష్ణవి శర్మ 11 మ్యాచ్ల్‌లో 21 వికెట్లతో సత్తా చాటింది. ఇదిలా ఉంటే వన్డే వర ల్డ్‌కప్ ఫైనల్‌లో అనూహ్యంగా రీఎంట్రీ ఇచ్చి దుమ్మురేపిన షెఫాలీ వర్మ తన ప్లేస్ నిలుపుకుంది. అంతకుముందు సీనియర్ వుమెన్స్ టీ20 టోర్నీలో షెఫాలీ మెరుపులు మెరిపించింది. ప్రపంచకప్ విజయంలో కీలకపాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, స్నేహా రాణా, అరుంధతి రెడ్డి,శ్రీచరణి, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్ కూడా ఈ జట్టులో ఉన్నారు.
భారత్, శ్రీలంక మహిళా జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ డిసెంబర్ 21 నుంచి 30 వరకూ జరగనుంది. తొలి రెండు టీ20లకు విశాఖపట్నం ఆతిథ్యమిస్తుండగా.. మిగిలిన మూడు మ్యాచ్‌లు తిరువనంతపురంలో జరగనున్నాయి. నిజానికి ఈ సిరీస్ బంగ్లాదేశ్‌తో జరగాల్సి ఉండగా కొన్ని కారణాలతో అది రద్దయింది. బంగ్లా జట్టుకు రీప్లేస్‌మెంట్‌గా శ్రీలంకతో సిరీస్‌ను బీసీసీఐ ఏర్పాటు చేసింది. ప్రపంచకప్ తర్వాత భారత్ మహిళల జట్టు ఆడుతున్న తొలి సిరీస్ ఇదే.
భారత మహిళల టీ20 జట్టు: హర్మన్ ప్రీత్‌కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టె న్), దీప్తి శర్మ, స్నేహా రాణా, జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, హార్లిన్ డియోల్, అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్, రిఛా ఘోష్ (కీపర్),జి కమలిని(కీపర్), శ్రీచరణి, వైష్ణవి శర్మ