26-07-2025 08:32:14 PM
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..
మంచిర్యాల (విజయక్రాంతి): సైనికుల త్యాగాలకు ప్రతిబింబం "కార్గిల్ దివస్" అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాలో డీసీపీ ఎగ్గడి భాస్కర్, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ లతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సైనికులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... కార్గిల్ దివస్ కార్యక్రమాన్ని కార్మికుల త్యాగాలకు ప్రతిబింభమని, దీనిని భావితరాలకు తెలిసే విధంగా జరుపుకుంటున్నామన్నారు. 1999లో నావీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ సమిష్టిగా పోరాడి మన దేశ సరిహద్దులను కాపాడారని, ఆ సమయంలో పోరాడి అమరులైన సైనికుల త్యాగాలను స్మరించుకోవాలని కలెక్టర్ అన్నారు.
భారత దేశాన్ని సరిహద్దులలో సైనికులు 365 రోజులు 24 గంటలు ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుతున్నారని, దేశ ప్రజల రక్షణ కోసం అందరినీ వదిలి దేశ సేవలో ఉన్నారన్నారు. నిరంతరం విధులు నిర్వహిస్తున్న సైనికులకు గౌరవంగా కార్గిల్ దివస్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొనాలని కోరారు. మాజీ సైనికులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, పోలీస్ అధికారులు, ఎన్.సి.సి. విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.