calender_icon.png 23 December, 2025 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్లేమ్ గేమ్ ఆడుతున్న కేసీఆర్

23-12-2025 12:58:21 AM

  1. కుంభకర్ణుడిలా ఉంది కేసీఆర్ తీరు
  2. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 22 (విజయ క్రాంతి): అధికారం పోయాక రెండేళ్ల తర్వాత కేసీఆర్ నిద్ర లేచి, బ్లేమ్ గేమ్ ఆడుతున్నారని, పచ్చిఅబద్ధాలు చెప్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ విమర్శించారు. అయన తీరు కుంభకర్ణుడు నిద్ర లేచి మాట్లాడినట్లు ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో బీజేపీ పైన ఏడ్చారు.. ఇప్పుడు కూడా ఏడుస్తూనే ఉన్నారని మండిపడ్డారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని ఆమె స్వగృహంలో నిర్వహించిన మీడీయా సమావేశంలో డీకే అరుణ మాట్లాడారు.

కేసీఆర్ గతాన్ని మర్చిపోయారా.. ఆయనకు మతిమరుపు వచ్చిం దా అనే అనుమానం కలుగుతోందన్నారు. పాలమూరు ప్రజలు కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించకపోతే తెలంగాణ వచ్చేది కాదు. అయన సీఎం అయ్యే వారు కూడా కాదని తెలిపారు. నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్ సాగర్ అప్పటికే ఆన్ గోయిన్ ప్రాజెక్టులన్నారు. ఆదివారం  కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాట పచ్చి అబద్ధమన్నారు. కేసీఆర్ పచ్చి అబద్ధాలు.. జూటా మాటలు మాట్లాడారని తెలిపారు.

పాలమూరు ప్రాజెక్టు డీపీఆర్ మార్చి పాలమూరుకి తీరని అన్యాయం చేశారని, 90 శాతం పనులు పూర్తి అయినా మొత్తం ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదని ఆమె ప్రశ్నిచారు. పాలమూరు జిల్లా కోసం బీజేపీ ఏం చేయాలో అదే చేస్తున్నామని, అభివృద్ధిపై అప్పట్లో మిమ్మల్ని నిలదీసినట్లు... కాంగ్రెస్‌ను కూడా నిలదీస్తున్నామని స్పష్టం చేశారు. ఫామ్‌హౌస్‌లో పడుకుని లేచి వచ్చిన కేసీఆర్ బ్లేమ్ గేమ్ ఆడుతున్నారన్నారు. పాలమూరు నుంచి సీఎంగా రేవంత్‌రెడ్డి అయినా పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయడంలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో కేసీఆర్ పాలనను అనుసరిస్తోందని విమర్శిం చారు.

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ రెండేనని, అవి బీజేపీ అధికారంలోకి రావద్దని కుట్రలు పన్నుతున్నాయని పేర్కొన్నారు. కవితకు కండ్లు ఉంటే.. గద్వాల అభివృద్ధి కనిపించేదని, పదేళ్లు తండ్రి చాటున ఉన్న కవిత.. ఇప్పుడు నీతి వ్యాఖ్యలు మాట్లాడితే ప్రజలు నమ్ముతారా? అని అన్నారు. ఆస్తుల పంచాయితీతో ప్రజలను ఫూల్స్ చేయాలను కుంటే.. ప్రజలు ఫూల్స్ కారని డీకే అరుణ స్పష్టం చేశారు.