calender_icon.png 22 November, 2025 | 3:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లిక్కర్ దందాతోనే కేజ్రీవాల్ శీష్‌మహల్

10-02-2025 12:00:00 AM

  • అవినీతే ఆ పార్టీ ఓటమికి కారణం
  • త్వరలోనే కాంగ్రెస్ ముక్త్ భారత్ సాధిస్తాం 
  • మెదక్ ఎంపీ రఘునందన్‌రావు

మెదక్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): ఢిల్లీలో ఎమ్మెల్సీ కవితతో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ మద్యం సీసాలు అమ్మి శీష్ మహల్ నిర్మించారని, కేజ్రీవాల్ పాలన అవినీతిమయంగా మారడంతోనే ఆ పార్టీ ఓటమికి కారణమని మెదక్ ఎంపీ రఘునందన్రావు విమర్శించారు. ఆదివారం మెదక్ బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..త్వరలోనే కాంగ్రెస్ ముక్తి భారత్ను సాధిస్తామని తెలిపారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు గుండు సున్నానే మిగిలిందని, మరో మూడు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ ముక్తి భారత్ సాధించినట్లేనని తెలిపారు. అవినీతి మరక ఉన్న ఏ పార్టీకి ప్రజలు ఆదరించరని, అందులో భాగంగానే ఢిల్లీలో కేజ్రీవాల్ పార్టీకి గుణపాఠం చెప్పారన్నారు. దేశంలో కేవలం బీజేపీకే భవిష్యత్తు ఉందని, ప్రస్తుతం దక్షిణ భారతే లక్ష్యంగా బీజేపీ ముందుకు దూసుకు పోతుందన్నారు. ఢిల్లీలో వరుసగా గడిచిన మూడు పార్ల మెంట్ ఎన్నికల్లో అన్నీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా, కాంగ్రెస్ కు మిగిలింది కేవలం గాడిద గుడ్డేనని ఏద్దేవా చేశారు.

అవినీతి మరక లేకుండా కేవలం రెండు సీట్లతో మొదలైన బీజేపీ ప్రస్థానం వరుసగా మూడు సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. 125 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ కథ ఇక ముగిసిందని, డబుల్ ఇంజన్ సర్కార్ తోనే దేశం, రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమన్నారు. మోడీ పాలనలో ఆర్టికల్ 370, రామమందిర నిర్మాణం వంటి ఎన్నో జటిల సమస్యలకు దిశా నిర్దేశం చేసిందన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అయ్యిందని, అప్పటినుండి ఇప్పటి వరకు దాదాపు 8000 వేల మంది ఉద్యోగులు రిటైర్డ్ అయితే ఇప్పటికీ ఒక్కరిని రిలీవ్ చేయలేని దుర్భర స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. కనీసం ఇప్పటికి ఒక్క డీఏ కూడా ఇవ్వలేక పోయిందన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాషాయ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో బీఆర్‌ఎస్ కు కనీసం ఎమ్మెల్సీ అభ్యర్థులు కరువయ్యారని ఆ పార్టీ పని అయి పోయిందన్నారు. విద్యావంతుల చూపు బీజేపీ వైపు ఉందని ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమదే గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు మల్లేశం గౌడ్, రామ్మోహన్, విష్ణువర్ధన్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్, పంజా విజయ్, ఎక్కలదేవి మధుసూదన్, శ్రీనివాస్, రాజు, నల్లాల విజయ్, బెండే వీణాతో పాటు బూత్ స్థాయి అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.