01-10-2025 01:08:18 AM
ఇనుగుర్తికి పోలీస్ స్టేషన్ మంజూరు
మహబూబాబాద్, సెప్టెంబర్ 39 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో కొత్త పోలీస్ సర్కిల్ కేంద్రంగా కేసముద్రం ఏర్పాటు కానుంది. ఈ మేరకు తొర్రూరు సర్కిల్ పరిధిలో ఉన్న నెల్లికుదురు, ప్రస్తుత కేసముద్రం, కొత్తగా ప్రకటించిన ఇనుగుర్తి పోలీస్ స్టేషన్ లను కేసముద్రం సర్కిల్ పరిధిలోకి మారుస్తూ కొత్తగా కేసముద్రం సర్కిల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తూ ప్రిన్సిపల్ సెక్రెటరీ రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
కేసముద్రం మండల కేంద్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుడు, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి మున్సి పాలిటీగా ఏర్పాటు చేయించారు. ఈ క్రమంలో కేసముద్రం పట్టణాన్ని పోలీస్ సర్కిల్ కేంద్రంగా ఏర్పాటు చేయించారు. దీంతోపాటు కొత్తగా ఏర్పాటు చేసిన ఇనుగుర్తి మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు.
ఇప్పటికే కేసముద్రం పట్టణ సమగ్ర అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తూ అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి వేం నరేందర్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. విద్యుత్తు ఉపకేంద్రం, 30 పడకల ఆసుపత్రి, పట్టణంలో ప్రధాన రహదారుల విస్తరణ, సెంట్రల్ లైటింగ్, పాలిటెక్నిక్ కళాశాల, డిగ్రీ కళాశాల, ఫైర్ స్టేషన్ తో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను కేసముద్రం పట్టణానికి తీసుకువచ్చారు.
ఇందు కోసం అవసరమైన నిధులను కూడా ఆర్థిక శాఖ నుండి మంజూరు చేయించారు. ఈ క్రమంలో పోలీస్ సర్కిల్ స్టేషన్ మంజూరు కావడం పట్ల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం కేసముద్రం పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహా దారుడు వేం నరేందర్ రెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి, ఎంపీ పోరిక బలరాం నాయక్ చిత్రపటానికి మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి నేతృత్వంలో పార్టీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు.