01-10-2025 01:07:05 AM
మహబూబాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు సాగు చేస్తున్న వివిధ పంటలకు కనీసం మద్దతు ధరలను పెంచి అండగా నిలవాలని తెలంగాణ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం మహబూబాద్ జిల్లా కమిటీ సమావేశం గనిగంటి రాజన్న అధ్యక్షతన స్థానిక పెరుమాండ్ల జగన్నాథం భవన్ లో మంగళవారం జరిగింది.
రైతు సంఘం జిల్లా కార్యదర్శి శెట్టి వెంకన్న మాట్లాడుతూ యూరియా కొరత, అధిక వర్షలతో, పత్తి, వరి, పంటలు ఆశించిన దిగుబడి ఇచ్చే పరిస్థితి లేదని, రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. పత్తికి కనీస మద్దతు ధర లభించడం లేదని, పత్తికి క్వింటాలకు 10 వేలు, ధాన్యనికి, మొక్కజొన్నలకు 3 వేల రూపాయలు క్వింటాల్కు కనీస మద్దతు ధర చెల్లించాలన్నారు. వర్షాలతో నష్టపోయిన వరి, పత్తి పంటలకు ఎకరాకు 50వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలన్నారు.
రైతాంగ సమస్యలపై జిల్లావ్యాప్తంగా సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లపు సుధాకర్, మార్తినేని పాపారావు, గడ్డిపాటి రాజారావు, నంబూరి మధు, ధరవాత్ బుజ్జి, పల్లా ప్రభాకర్ రెడ్డి, బొబ్బ ఉపేందర్ రెడ్డి, తిరుపతిరావు, జలంధర్, కొడవండ్ల సైదులు, చందా వెంకన్న, కొత్త ప్రభాకర్ రెడ్డి, పెరుమాండ్ల పుల్లయ్య, తోట నరసయ్య తదితరులు పాల్గొన్నారు.