07-11-2025 12:08:17 AM
కన్నడ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ‘కేజీఎఫ్’ నటుడు హరీశ్ రాయ్ (55) కన్నుమూశారు. ఏడాది కాలంగా థైరాయిడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని కిడ్వాయ్ మెమోరియల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. కన్నడలో హరీశ్ ఎన్నో సినిమాల్లో నటించటం ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రతినాయక పాత్రలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్2’ చిత్రాల్లో ఖాసీం చాచాగా అందరికీ గుర్తుండిపోయే పాత్రలో కనిపించారు.
అంతకుముందు శివరాజ్‌కుమార్ కథానాయకుడిగా ఉపేంద్ర దర్శకత్వంలో వచ్చిన ‘ఓం’ (1995) చిత్రంలో ఆయన నటించిన డాన్ రాయ్ పాత్ర కూడా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. తన సుదీర్ఘ కెరీర్‌లో హరీశ్ రాయ్ ‘ఓం’, ‘సమర’, ‘బెంగళూరు అండర్ వరల్డ్’, ‘జోడిహక్కి’, ‘స్వయంవర’, ‘నల్ల’, ‘రాజ్ బహదూర్’, ‘దండుపాల్య’, ‘సంజు వెడ్స్ గీత’ వంటి చిత్రాల్లోనూ నటించి మెప్పించారు. కన్నడతోపాటు తెలుగు, తమిళంలోనూ హరీశ్ పలు సినిమాలు చేశారు. ‘కేజీఎఫ్’ రెండోభాగం విడుదలయ్యే సమయానికే హరీశ్‌కు థైరాయిడ్ క్యాన్సర్ 4వ దశలో ఉన్నట్టు నిర్ధారణ అయింది. అప్పట్నుంచి మహమ్మారితో పోరాడుతున్న హరీశ్ పొట్టపై తీవ్ర ప్రభావం పడ్డట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే బాగా బక్కచిక్కిపోయారు.
గతంలో ఓ ఇంటర్వ్యూలో హరీశ్ రాయ్ తన ఆరోగ్యం గురించి వెల్లడిస్తూ.. “పరిస్థితులు కొన్నిసార్లు మాత్రమే మనకు అనుకూలంగా ఉంటాయి. నేను క్యాన్సర్‌తో బాధ పడుతున్నా. నా గొంతు భాగంలో వాపు వచ్చిన కారణంగా అది కనిపించకుండా ఉండేందుకు గడ్డం పెంచాను. ‘కేజీఎఫ్’లో గడ్డంతోనే కనిపించాను” అని తెలిపారు. హరీశ్ మృతి పట్ల కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తోపాటు పలువురు సినీరంగ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.