calender_icon.png 7 November, 2025 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గర్ల్‌ఫ్రెండ్ స్వరాలకు స్ఫూర్తి.. పాత్రల మధ్య సంఘర్షణే!

07-11-2025 12:07:04 AM

సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్

రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ఈ సినిమాను దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు.  ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రం ఈ నెల 7న హిందీ, తెలుగు భాష ల్లో విడుదల కానున్న సందర్భంగా హేషమ్ విలేకరులతో  ముచ్చటించారు. “ది గర్ల్‌ఫ్రెండ్’ కథ బలమైన భావోద్వేగాలతో నిండి ఉంటుంది.

వరుసగా ప్రేమకథా చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ వచ్చాను. ఇప్పుడు వేరే జానర్ సినిమాలకు ఆఫర్స్ వస్తున్నాయి. నేను ఈ సినిమాకు బీజీఎం కూడా నేను ప్రారంభించా. అయితే, కొన్ని కారణాలతో ఈ చిత్రం ఆలస్యమవుతూ వచ్చింది. అందుకే ఆ టైమ్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు ప్రశాంత్ విహారిని తీసుకున్నారు. సాటి సంగీత దర్శకుడిగా ప్రశాంత్ ఈ సినిమాకు పనిచేయడం సంతోషంగా అనిపించింది. నేను అనుకున్న ఫీల్ అతని బీజీఎంలో కూడా కనిపించింది. పాటలన్నీ కథలో సరైన సందర్భంలో వచ్చేలా డైరెక్టర్ రాహుల్ డిజైన్ చేసుకున్నారు.

ప్రేమకథలకు బీజీఎం చాలా కీలకం. మొత్తం నాలుగు పాటలుంటాయి. ఇటీవల రిలీజ్ చేసిన ‘నీదే నీదే కథా..’ పాట కంపోజింగ్ కోసం ఎక్కువ కష్టపడ్డా. ఈ పాట చేసేముందు డైరెక్టర్ రాహుల్ నాతో ‘ఇది ప్రతి అమ్మాయి ఆంథమ్‌గా ఉండాలని, మొత్తం ఆల్బమ్‌కు ఇండియన్, వెస్ట్రన్ కలిసిన మ్యూజిక్ కావాలని అడిగాడు. అందుకే మన రాగాలు, వెస్ట్రన్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉపయోగించాం. సినిమాలో విక్రమ్, భూమా పాత్రల మధ్య ఉండే సంఘర్షణే నేను మంచి పాటలు చేసేందుకు స్ఫూర్తినిచ్చింది. ఒకేలా ఉన్న సినిమాలు వస్తే వదులుకుంటున్నా. త్వరలో మాస్, బీట్ సాంగ్స్ కూడా చేయబోతున్నా. తెలుగులో ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ, వైష్ణవి జంటగా దర్శకుడు ఆదిత్య హాసన్ రూపొందిస్తున్న సినిమా చేస్తున్నా. తమిళం, కన్నడలో సినిమాలూ ఉన్నాయి. నా ఫస్ట్ బాలీవుడ్ మూవీ కూడా త్వరలో ప్రకటిస్తా” అని తెలిపారు.