15-08-2025 01:49:00 AM
ఖమ్మం 36వ డివిజన్‌లో స్టార్మ్ వాటర్ డ్రైన్, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల
ఖమ్మం, ఆగస్టు 14 (విజయ క్రాంతి): ప్రశాంతమైన నగరంగా ఖమ్మంను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. మంత్రి, ఖమ్మం 36వ డివిజన్ గాంధీ చౌక్ లో గురువారం 2 కోట్ల 25 లక్షలతో చేపట్టిన స్టార్మ్ వాటర్ డ్రైన్, సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ నగరంలో ప్రజలందరూ కలిసికట్టుగా ప్రశాంతంగా బ్రతకాలని గాంధీ చౌక్ వ్యాపారస్తులు ఎన్నికల సమయంలో కోరుకున్నారని, ప్రస్తుతం ప్రశాంతమైన ఖమ్మం నగరం అభివృద్ధి దిశగా పయనిస్తుందని అన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన తల్లి సోనియాగాంధీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను, సంక్షేమ పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అమలు చేస్తున్నారని అన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని రైతుల శ్రేయస్సుకు, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. రోడ్లు వెడల్పు చేసుకుంటే అభివృద్ధి సాధ్యం అవుతుందని, మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మొక్కలను పెంచి గ్రీనరీ పెంపుకు చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు.
ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఖమ్మం నగరంలో అవసరమైన రోడ్లు, డ్రైన్ల అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. మంత్రి ప్రత్యేక చొరవ వల్ల ఖమ్మం రోప్ వే మంజూరు అయ్యిందని, ఖానాపురం ఊర చెరువు నుంచి అల్లిపురం వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరుగుతున్నాయని అన్నారు. అనంతరం మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ రంజిత్, ఖమ్మం ఆర్డీఓ నరసింహా రావు, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సైదులు, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.