14-01-2026 01:50:36 AM
జాతరకు తీసుకెళతానని నమ్మబలికిన బైకర్
బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం
పోలీసులకు చిక్కిన కిడ్నాపర్.. చిన్నారులు సేఫ్
బెంగళూరు, జనవరి 13: కర్ణాటకలోని ధార్వాడ్‌లో కిడ్నాప్ యత్నం కలకలం రేపింది. ప్రభుత్వ పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజన సమయంలో ఇద్దరు విద్యార్థినులు కనిపించకుండా పోయారు. తరగతులు మొదలైనా పిల్లలు రాకపోవడంతో టీచర్లు ఆరా తీయగా కిడ్నాప్ వ్యవహారం బయటపడింది. వెంటనే పిల్లల తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, బైక్ పై వెళుతున్న కిడ్నాపర్ రోడ్డు ప్రమాదానికి గురికావడంతో పోలీసులకు దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే..ధార్వాడలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో తన్వీర్, లక్ష్మి అనే మూడో తరగతి చదువుతున్న పిల్లలు కనిపించకుండా పోయారు.
దీంతో టీచర్లు వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడమే గాక ఆపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగిన పోలీసులు స్కూలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. అందులో పిల్లలను ఓ వ్యక్తి బైక్ పై ఎక్కించుకుని వెళ్లడం కనిపించింది.అప్రమత్తమైన పోలీసులు.. కిడ్నాపర్ వెళ్లిన మార్గంలో ఓ సెర్చి పార్టీని పంపించారు. అదే సమయంలో ఉత్తర కన్నడ జిల్లా దండేలి సమీపంలో కిడ్నాపర్ బైక్ ప్రమాదం జరిగింది. పోలీసులు అక్కడికి చేరుకుని ఆరా తీయగా అతను పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో పిల్లలను కిడ్నాప్ చేసినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పిల్లలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కరీమ్ మేస్త్రీగా గుర్తించి అరెస్ట్ చేశారు. ఉలవి చెన్నబసవేశ్వర జాతరకు తీసుకెళతానని చెప్పి పిల్లలను తీసుకెళ్లినట్టు నిందితుడు వెల్లడించాడు.