14-01-2026 01:48:25 AM
భద్రతా దళాల కాల్పులు, దాడుల్లో ౨ వేల మంది మృతి
ఒక యువకుడికి ఏకంగా ఉరిశిక్ష
ఏమాత్రం వెనక్కి తగ్గని ఖమేనీ ప్రభుత్వం
టెహ్రాన్, జనవరి 13: ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు ఉధృతమవుతున్న కొద్దీ మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నది. భద్రతా బలగాల కాల్పులు, దాడుల్లో ఇప్పటివరకు ౨ వేల మందికి పైగా మృతిచెందార ని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా టెహ్రాన్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రి ముందు గుట్టలు గుట్టలుగా చెల్లాచెదురుగా శవాలు పేరుకున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వి షయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. మరోవైపు పౌరులు చేస్తున్న ఉద్య మాలను అక్కడి ప్రభుత్వం ఉగ్రవాద చర్యగా అభివర్ణిస్తున్నది. ఇకముందు కూడా నిరసనలు కొనసాగిస్తే మరణాల సంఖ్య పెరుగుతుందని హెచ్చరించింది. ఈ పరిణామాలపై ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఇరాన్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఆందోళన కారులపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని ప్రకటించారు. అయినప్పటికీ ఖమేనీ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. నిరసన కారులను ఊచకోతకోస్తుంది.
యువకుడికి ఉరిశిక్ష.. నేడు అమలు?
ఇరాన్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఇటీవల కరాజ్ సబర్బ్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న ఇర్ఫాన్ సుల్తానీ అనే ౨౬ ఏళ్ల యువకుడికి తాజాగా అక్కడి ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది. సదరు యువకుడు దేవుని దూషణకు పాల్పడ్డాడని, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించాడనేది యువకుడిపై ప్రధానంగా ఉన్న నేరారోపణలు. బుధవారం ఈ మేరకు ఉరిశిక్ష అమలు చేస్తున్నట్లు యువకుడి కుటుంబ సభ్యులకు సైతం సమాచారం అందించింది. సదరు యువకుడికి కనీసం ఒక న్యాయవాదిని పెట్టుకునే అవకాశమైనా ప్రభుత్వం ఇవ్వలేదు. శిక్ష ప్రకటించే ముందు యువకుడిని కేవలం ౧౦ నిమిషాలు మాత్రమే కుటుంబ సభ్యులను కలిసేందుకు అవకాశం లభించింది. సుల్తానీకి కనీసం న్యాయపరమైన హక్కులు కల్పించలేదని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. నిరసనకారులను భయపెట్టి ప్రజల ఆందోళనలను అణచివేసేందుకే ఇరాన్ ప్రభుత్వం ఇలాంటి శిక్షలు అమలు చేస్తోందని మండిపడుతున్నాయి.