calender_icon.png 27 July, 2025 | 11:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కింగ్‌డమ్ టికెట్ ధరల పెంపు

25-07-2025 01:44:15 AM

ఇటీవల భారీ బడ్జెట్‌తో రూపొందిన సినిమాలకు ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరల పెంపునకు, ప్రత్యేక షోలకు అనుమతి ఇస్తున్న సంగతి తెలిసిందే. మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం చారిత్రక విశేషాలతో తెరకెక్కిన చిత్రాలకు తప్ప ఏ సినిమాలకూ టికెట్ ధరలు పెంచబోమని, స్పెషల్ షోలకూ అనుమతించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే సినిమా విడుదలకు ఒక రోజు లేదా రెండు రోజుల ముందు టికెట్ ధరల పెంపు విషయాన్ని ప్రకటిస్తారు.

కానీ, ‘కింగ్‌డమ్’ సినిమాకు రిలీజ్‌కు ఇంకా వారం రోజులు ఉండగానే టికెట్ ధరల పెంపునకు ఏపీ సర్కార్ అనుమతినిచ్చింది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న సినిమా ఇది. జూలై 31న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా టికెట్ రేట్ల పెంపు కోసం ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించగా సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టిప్లెక్సుల్లో రూ.75 అదనంగా పెంచుకునే వెసులుబాటను ఇచ్చారు.

ఈ ధరలు సినిమా విడుదలైన రోజు నుంచి 10 రోజుల పాటు అందుబాటులో ఉండనున్నాయి. టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం స్పెషల్ షోలు, ప్రీమియర్ షోలకు మాత్రం ఎలాంటి అనుమతి ఇవ్వనట్టు తెలుస్తోంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఈ నెల 26న తిరుపతిలో ఏర్పాటుచేయనున్నారు. 28వ తేదీన హైదరాబాద్ వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.